నో క్లారిటీ.. రిజిస్ట్రేషన్ల సంగతి ఏంటి..?

by Shyam |
నో క్లారిటీ.. రిజిస్ట్రేషన్ల సంగతి ఏంటి..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూడు నెలలైనా నో క్లారిటీ.. నేటికీ సవాలక్ష సమాధానాలు లేని ప్రశ్నలు.. శాఖను సంస్కరిస్తామని సర్కార్​ చేపట్టిన పని స్పష్టత లేక మొత్తం ప్రక్రియనే గందరగోళంలోకి నెట్టింది.. రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి అటు సామాన్య జనం ఇబ్బంది పడడమే కాకుండా, ఇటు ప్రభుత్వం కూడా కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది.. ఎట్టకేలకు దాదాపు వంద రోజుల తర్వాత రిజిస్ట్రేషన్‌లకు ప్రభుత్వం ఒకే అని అనౌన్స్​ చేసినా, ఎల్​ఆర్​ఎస్​, వ్యవసాయేతరం వంటి పలు విషయాల్లో స్పష్టత లేని కారణంగా ఇటు అధికారులు, అటు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

రెవెన్యూ శాఖలో సంస్కరణలు తీసుకురావాలన్న సంకల్పంతో తెలంగాణ సర్కార్​ తీసుకున్న నిర్ణయంతో అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జీఓ నం.102 జారీ తో రాష్ట్రంలో మూడు నెలల పాటు భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఫుల్​స్టాప్​ పడింది. ఎట్టకేలకు ఇప్పుడు తదుపరి ప్రజలు శుక్రవారం నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చునని, 14వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేస్తామని ఆదేశాలు వచ్చేశాయి. కానీ ఏయే ఆస్తులను రిజిస్ట్రేషన్​ చేయాలో అధికారులకు మాత్రం క్లారిటీ లేదు. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి కలిగిన లేఅవుట్లలోని ప్లాట్లు, ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్​ పొందిన ప్లాట్లు మాత్రమే చేస్తామనీ వెల్లడించలేదు. ఈ క్రమంలో తమకు గతంలో మున్సిపల్, పంచాయత్ రాజ్ శాఖల కొత్త చట్టాల మేరకు అనుమతి కలిగిన వాటినే చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అప్పటి కమిషనర్ చిరంజీవులు ఉత్తర్వులు జారీ చేశారని, అది ఇంకా అమల్లోనే ఉందని ఓ సబ్ రిజిస్ట్రార్ గుర్తు చేశారు. దాని అమలు చేస్తూనే ప్రభుత్వం సూచించిన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

రెండు కొత్త చట్టాల ప్రకారంగా చూస్తే అనుమతి కలిగిన ఆస్తుల క్రయ విక్రయాలే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, గురువారం రాత్రి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జారీ చేసిన ప్రకటనలో స్పష్టత లేదు. అందులో కేవలం స్లాట్ల బుకింగ్, రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టే షెడ్యూల్ మాత్రమే ఉంది. దీంతో తమ ప్లాట్లు అమ్ముకోవచ్చునా అంటూ సబ్ రిజిస్ట్రార్లకు, డాక్యుమెంట్ రైటర్లకు ఫోన్ల తాకిడి పెరిగింది. చాలా రోజుల క్రితమే అడ్వాన్సులు ఇచ్చామని, నిర్దేశించిన కాల పరిమితి అయిపోతుందంటూ పలువురు కొనుగోలుదార్లు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రధానంగా అనుమతి లేని ప్లాట్ల లావాదేవీలే అధికంగా ఉండడంతో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లేకుండా క్రయ విక్రయాలకు మరో మార్గమేదైనా ఉందా అంటూ వెతుక్కుంటున్నారు. మొత్తంగా ఇదివరకటితో పోల్చితే రిజిస్ట్రేషన్లు 15 నుంచి 20 శాతానికి పరిమితం కావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, వ్యవసాయం, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా సగటున రోజూ 12 వేల నుంచి 14 వేల వరకు ఉండేదని, అది ఇప్పుడు 2 నుంచి 3 వేలకే పరిమితయ్యే అవకాశం ఉంది.

ఎల్ఆర్ఎస్ పరిష్కారంతోనే మేలు..

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 29 లక్షల వరకు వచ్చాయి. ఖాళీ ప్లాట్లల్లో ఎక్కువగా దరఖాస్తుల పరిశీలనలోనే ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తేనే క్రయ విక్రయాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయని ప్లాట్ల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటాయని అంచనా. చిన్న గ్రామాల్లోనూ ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్ అడిగితే లావాదేవీలు నిలిచిపోనున్నాయి. దాని కారణం వాళ్లు ఇప్పటికీ దరఖాస్తు చేసుకోకపోవడమే. ప్రభుత్వం ప్రస్తుతం దాఖలైన దరఖాస్తులను పరిశీలించే వ్యవస్థను రూపొందించలేదు. నేటికీ ఏ ఒక్క దరఖాస్తును పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మొదలు పెట్టినా అన్ని దరఖాస్తులను పరిశీలించి ఆమోదించేందుకు కనీసం ఆర్నెళ్లయినా పట్టేటట్లు ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వీటిని ఇలాగే పెండింగులో ఉంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద గండి పడేటట్లుగా ఉందంటున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పురపాలికలు, పంచాయతీ రాజ్ శాఖల్లో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయలేదు.

ఇంతకీ సాధించిందేంది?

మూడు నెలల పాటు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. పైగా తెలంగాణ రిజిస్ర్టేషన్‌ యాక్ట్‌, 1908 ప్రకారం రిజిస్ర్టార్‌ అండ్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో వీలునామాలు, మ్యారేజ్​లు, ఫ్రాంక్లిన్‌ సర్వీసులు మాత్రమే కొనసాగించారు. ధరణి పోర్టల్ ద్వారానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలన్న సంకల్పం నెరవేరలేదు. వ్యవసాయేతర ఆస్తుల డేటాను నమోదు చేయడం సాధ్యమన్న విషయాన్ని ఉన్నతాధికారులు కూడా సీఎం కేసీఆర్ కు వివరించలేదు. దాంతో కేవలం ఆస్తి పన్ను నంబరు ఆధారంగా కేవలం ఇండ్ల వివరాలు మాత్రమే నమోదు చేయగలరు. కానీ ఓపెన్ ప్లాట్ల వివరాల సేకరణ చాలా కష్టమన్న అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ క్రమంలో ధరణిలో నమోదైన ప్రాపర్టీస్ కు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తామన్న అంశం అమలు చేయలేరని తేలిపోయింది. హైకోర్టు కూడా పాత పద్ధతి ద్వారానే రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఐతే ప్రభుత్వం మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని ప్రకటించడం గమనార్హం.

తప్పుదోవ పట్టించారు: దేవరాజు విష్ణు వర్ధన్ రాజు, సబ్ రిజిస్ట్రేషన్ల శాఖ రిటైర్డ్ అధికారి

ప్రభుత్వం మూడు నెలలుగా ‘‘రూల్-5’’ ప్రకారం రిజిస్ట్రేషన్ నిలిపి వేస్తున్నట్టు చెప్పింది. కానీ ఆ రూల్​ ప్రకారము రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకు సెలవు ఇచ్చినప్పుడు, రిజిస్ట్రేషన్ శాఖ కూడా అవే వర్తిస్తాయి. దానికి విరుద్ధంగా కేవలం ఒక్క రిజిస్ట్రేషన్ సేవలను మాత్రమే నిలిపివేశారు. ఇది పెద్ద తప్పు. నాలుగు కోట్ల ప్రజానీకాన్ని, లక్షలాది రిజిస్ట్రేషన్ పబ్లిక్ ను తప్పుదోవ పట్టించడమే. రూ.వేలాది కోట్ల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ రాకుండా అడ్డుకోవడం కూడా తప్పే. హైకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశామంటూ ప్రభుత్వం చెబుతూ వచ్చింది.

కానీ ఈ విషయంలో హైకోర్టు చాలా స్పష్టంగా ‘‘మా ముందున్న అంశాలు వేరు.. రిజిస్ట్రేషన్ల ఆపుదలకు మా ముందున్న అంశాలకు ఏ రకమైన సంబంధం లేదు’’ అని స్పష్టం చేసింది. ఇంత కాలంగా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందనడంలో సందేహం లేదు. ఇది పచ్చి మోసం. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు పాత పద్ధతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది ? హైకోర్టు పరిధిలో లేని అంశాలను హైకోర్టు పరిధిలో ఉందని ప్రజలను నమ్మబలికి ఇప్పటి వరకు రకరకాల ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సమంజసం? సాధ్యం కాని అంశాలను హడావిడిగా అమలు చేయాలని ప్రభుత్వం భావించడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఇకనైనా ప్రభుత్వం అనవసరమైన పట్టింపులకు పోకుండా 150 సంవత్సరాలుగా సజావుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను అలాగే కొనసాగించాలి. రిజిస్ట్రేషన్ విధానంలో మార్పు తేవాలని భావిస్తే సుశిక్షితులైన సిబ్బంది ద్వారా మాత్రమే ఆ పనులు పూర్తి చేయాలి. వారి సలహా సంప్రదింపులతో మార్పులు, చేర్పులు చేపట్టాలి.

కొత్త రూపు..

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ కొత్త రూపు సంతరించుకున్నది. ఆస్తుల వారీగా లావాదేవీలను చూసుకునే వీలు కల్పించారు. అందులో అర్బన్ ల్యాండ్స్, ప్రాపర్టీస్ ను ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాగే రూరల్ ప్రాపర్టీస్, ఎన్ కంబరెన్స్ ప్రాపర్టీస్, ఎన్ కంబరెన్స్ సెర్చ్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కు ప్రత్యేకంగా లింక్ లు ఇచ్చారు.

Advertisement

Next Story