లీకులా? ఉహాగానాలా?.. లాక్‌డౌన్‌పై నో క్లారిటీ

by srinivas |

లాక్‌డౌన్ గడువు అంతిమ దశకు చేరుకుంది. ప్రధాని జాతినుద్ధేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో ఊహాగాలు ఊరిస్తున్నాయి. లాక్‌డౌన్ 2.0 అని కొంతమంది పేర్కొంటుండగా, ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ ఎత్తివేయనున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రధానితో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ లాక్‌డౌన్ ఎత్తివేయడానికే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగినా ఏపీలో మాత్రం లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రాధ్యనత నిస్తే లాక్‌డౌన్ కొనసాగించడమే మార్గమని, అదే సమయంలో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోతుందన్న అంచనాలున్నాయి. దీంతో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజా జీవనంతో పాటు ఆర్థిక వృద్ధిని కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతోంది. అందుకే రెండో విడత లాక్ డౌన్‌కు సిద్ధంగా లేమని కేంద్రానికి సంకేతాలిస్తోంది. అదే సమయంలో ప్రధాని ప్రతిపాదనకు కూడా సంసిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే మరో 15 రోజుల లాక్ డౌన్‌ రాష్ట్రానికి కష్టమంటూనే.. సిద్ధమని చెబుతూ, రాజకీయ చతురతను ప్రదర్శిస్తోంది. లాక్‌డౌన్ పొడిగిస్తే కేంద్రం నిధులు ఇవ్వాల్సిందేనని సూచనలిస్తోంది.

ఇదే సమయంలో లాక్‌డౌన్ సడలింపుల్లో 15 రకాల పరిశ్రమలు, వీధి వ్యాపారులను పరిగణనలోకి తీసుకొనున్నట్టు సచివాలయ ఉద్యోగుల ద్వారా తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగకుండా ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో భాగంగా చర్యలు చేపట్టనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలోకి పెట్టడం ద్వారా, ప్రజా జీవనానికి ఆటంకం లేకుండా చూడాలని జగన్ అధికారులకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిశ్రమలు ఒకే షిఫ్ట్ విధానంలో పని చేసుకునేందుకు అనుమతించేదిశగా ప్రణాళికలు సిద్దం చేసినట్టు సమాచారం.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విపక్షాలు డిమాండ్ చేస్తున్న మత్స్య పరిశ్రమ, అరటి, మామిడి పళ్ల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు పూర్తి అధికారాలు కట్టబెట్టినట్టు సమాచారం. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు పరిమిత సంఖ్యలో అనుమతులివ్వాలని తద్వరా సరకు రవాణాకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీటన్నింటినీ నిరంతర పర్యవేక్షణ, పకడ్బందీ ప్రణాళిక, సామాజిక దూరం పాటించడం ద్వారా సరైన చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో లాక్‌డౌన్ తొలగించేందుకే ఏపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Tags: andhrapradesh, lockdown, ap cm, jagan, lockdown free,

Advertisement

Next Story

Most Viewed