వరుస సెలవులు.. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే..

by Shyam |
వరుస సెలవులు.. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే..
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో నగర వాసులు చుక్కలు కనిపిస్తున్నాయి. మార్చి 31 అకౌంట్స్ క్లోజింగ్, ఒకటో తేదీ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం, రెండవ తేదీ గుడ్ ఫ్రైడే కారణంగా బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అనే తేడా లేకుండా అన్ని బ్యాంకుల్లోని ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడింది. శనివారం బ్యాంకులు పనిచేసినప్పటికీ ఏటీఎంలలో నగదు నింప లేదు.

ఈ కారణంగా ఖాతాదారులు డబ్బులు డ్రా చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. 90 శాతం ఏటీఎంలలో నగదు లభించలేదు. రద్దీ తక్కువగా ఉండే కొన్ని మారుమూల ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు ఉన్నప్పటికీ రూ.200, రూ.100 డి నామినేషన్లు చూపించాయి. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసుకోవాలని అనుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం కూడా ఏటీఎంలలో నగదు లేకపోగా దీని ప్రభావం మరో రెండ్రోజులు ఉండనుంది. నాలుగో తేదీ ఆదివారం, 5వ తేదీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కావడంతో మరో రెండ్రోజులు కూడా బ్యాంకులు, ఏటీఎంలు పని చేయని పరిస్థితి నెలకొనడంతో ఏం చేయాలో తోచని స్థితిలో కస్టమర్లు ఉండిపోయారు.

Advertisement

Next Story