ఇరాన్ లో తెలంగాణవాసి ఆకలి చావు

by Anukaran |   ( Updated:2020-07-10 10:57:55.0  )
ఇరాన్ లో తెలంగాణవాసి ఆకలి చావు
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత రాష్ట్రంలో ఉపాధి లేక బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్ళిన ఓ వ్యక్తి తిండి దొరక్క ఆకలితో మరణించాడు. అయితే, కుటుంబ పోషణ కోసం అయిన వారికి దూరంగా ఉంటూ ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. డబ్బుల సంపాదనలో పడి అక్కడుండే పరిస్థితులను ఎదుర్కొలేక చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఇరాక్‌లో రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు తనువు చాలించాడు.వివరాల్లోకివెళితే..

నిజామాబాద్ జిల్లాకు చెందిన పర్యామోల భోజన్న (46) కొన్నాళ్లుగా ఇరాక్ లోని ఎర్బిల్ పట్టణంలో చిక్కుకుపోయాడు. విదేశాల్లో పని చూపిస్తానని ఓ ఏజెంట్ చెప్పడంతో నమ్మి మోసపోయాడు. ఆ ఏజెంట్ ఉద్యోగం ఇప్పించకపోవడంతో అక్కడే రాష్ట్రానికి చెందిన ఇతర ప్రాంతాల వ్యక్తులతో కలిసి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో భోజన్న, తదితర తెలంగాణ కార్మికులకు ఉపాధి కరువైంది. వారందరూ తమను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని ఓ వీడియో ద్వారా కోరారు. ఉపాధి లేకపోవడంతో తినడానికి తిండి లేక ఆలమటిస్తూ భోజన్న చనిపోయాడు. జూన్ 29 నుంచి అతడి మృతదేహం ఎర్బిల్ లోని ఓ ఆస్పత్రి మార్చురీలో ఉంది. ఎలాగైనా తన భర్త మృతదేహాన్ని స్వస్థలం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ భార్య లక్ష్మి అందరినీ వేడుకుంటోంది. తెలంగాణ కార్మికుడి మృతి గురించి ఎర్బిల్‌లోని భారత కాన్సులేట్ అధికారులతో మాట్లాడామని తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్కూరి బసంత్ రెడ్డ తెలిపారు. వందేభారత్ మిషన్‌లో భాగంగా విదేశాలకు వస్తున్న భారత విమానాల్లో భోజన్న మృతదేహం తరలించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story