ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత.. ఖరారు చేసిన అధినేత

by Shyam |
akula lalitha
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలితకు అవకాశం దక్కింది. ఆదివారం 12 మంది అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రకటించారు. నిజామాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఆదివారం బీ-ఫారం అందచేశారు. సోమవారం ఎమ్మెల్సీగా ఆకుల లలిత నామినేషన్ వేసే అవకాశం ఉంది. మంగళవారం నామినేషన్‌ల ప్రక్రియ ముగియనుండటంతో కార్తీక సోమవారం మంచి రోజు అని నామినేషన్ వేయనున్నారు.

నిజామాబాద్‌కు చెందిన ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. మాక్లూర్ జెడ్పీటీసీగా, డిచ్‌పల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా, జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై 2018లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. నాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆకుల లలిత సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీగా ఆకుల లలిత రినివల్ చేస్తామన్న హామీ మేరకు పార్టీలో చేర్చుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఆకుల లలిత ఎమ్మెల్సీ పదవికాలం ముగిసింది. ఇటీవల గవర్నర్ కోటలో, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగినా, ఆకుల లలిత పేరు అందులో లేకపోవడంతో ఆమె రాజకీయ జీవితంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అంతే కాకుండా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉండటంతో సిట్టింగ్ స్థానం మార్పుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రాజకీయ పరిణామాల నేపథ్యంలో కల్వకుంట్ల కవిత రాజ్యసభకు వెళ్తుండటంతో ఆకుల లలితకు అవకాశం దక్కింది. ఎమ్మెల్సీగా ఆకుల లలితకు తిరిగి అవకాశం కల్పిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎమ్మెల్సీగా ఆకుల లలిత ఎంపిక కావడం లాంఛనమే అని చెప్పొచ్చు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ స్వీకరిస్తున్నా, ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. 820 మంది ఓటర్లు కలిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో రెండు పార్టీలకు మొత్తం కలిసి ఓటర్ల సంఖ్య 150 దాటలేదు. గడిచిన ఉప ఎన్నికల్లో గణనీయ ఓటర్లు ఉండగా టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ, కాంగ్రెస్‌లు పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రెండు పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. రాష్ట్రంలో తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీని ఎమ్మెల్సీ కవిత సాధించారు. ఈసారి సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా, పోటీ చేసేందుకు రెండు పార్టీల నుంచి అభ్యర్థులు కరువయ్యారు. గతవారం ముందుగా బీజేపీ, శనివారం కాంగ్రెస్ పార్టీలు అంతర్గత సమావేశాన్ని నిర్వహించి పోటీపై సమాలోచనలు చేశాయి.

బీజేపీ నుంచి నిజామాబాద్ అర్బన్ లేదా ఆర్మూర్‌కు చెందిన నేతను పోటీ చేసేలా ఒప్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో కామారెడ్డికి చెందిన ఇద్దరు లోకల్ లీడర్లను ఒప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ చివరిరోజు కావడంతో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి పోటీచేసే అభ్యర్థులు సోమవారం లేదా మంగళవారం ఖచ్చితంగా బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలకు సరైన గౌరవం దక్కడం లేదని, స్థానిక సంస్థల నుంచి ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఆదేశాల మేరకు ఎంపీటీసీ బరిలో నిలుచుండనున్నారని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు కాలేదు. సోమ, మంగళవారాల్లో పోటీలో నిల్చుంటారా లేకుంటే అధికార పార్టీకి జై అంటారా అనేది తేలిపోనుంది.

Advertisement

Next Story

Most Viewed