తెలంగాణ సర్కార్‌కు బిగ్ షాక్.. వెంటనే పనులు ఆపాలని ఎన్జీటీ ఆదేశాలు

by Anukaran |
తెలంగాణ సర్కార్‌కు బిగ్ షాక్.. వెంటనే పనులు ఆపాలని ఎన్జీటీ ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇరిగేషన్​ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు ఎలా చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం చేస్తున్న పనులను వెంటనే ఆపాలని ఆదేశాలిచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులపై ఇరకాటంలో పడింది. ఇప్పటికే కృష్ణా జలాల వినియోగంలో వెనకబడ్డామనే విమర్శల నేపథ్యంలో ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

సాగునీటి ప్రాజెక్టు అంటూ..

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై ఏపీ రైతులతో పాటుగా ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్​ట్రిబ్యునల్‌లో పిటిషన్​దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం వాదనలు విన్న ఎన్జీటీ ధర్మాసనం.. పనులను ఎక్కడికక్కడే ఆపాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేవని, సాగునీటి ప్రాజెక్టు కోసం ఎక్కడా అనుమతులు తీసుకోలేదంటూ ఏపీ ప్రభుత్వం వాదించింది. తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగునీటి పనులు చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పనులకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను ఎన్జీటీ ధర్మాసనానికి సమర్పించింది.

దీనిపై వాదనలు విన్న ఎన్జీటీ.. ఏపీ వాదనలు, అభ్యంతరాలను అంగీకరించింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఏవంటూ తెలంగాణ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. ఇంకా ఎన్విరాన్‌మెంట్​క్లియరెన్స్​రాలేదని చెప్పుకొచ్చిన తెలంగాణ తరఫు న్యాయవాదులు.. సరైన సమయంలో ఏపీ అభ్యంతరాలను ఎన్జీటీ దృష్టికి తీసుకురాలేదని వివరించారు. కానీ, తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్జీటీ అంగీకరించలేదు. ఈసీ అనుమతులు లేకుండా పనులు చేయరాదని, వెంటనే ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ ఆదేశాలిచ్చింది.

40 శాతం వరకు పనులు..

మరోవైపు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన పనులు చేయగా.. ఇప్పటికే రూ. 8 వేల కోట్ల బిల్లులు చెల్లించారు. ఇంకా రూ. 4 వేల కోట్లకుపైగా బిల్లులు పెండింగ్​ఉన్నాయి. ఈ నేపథ్యంలో పనులు కొనసాగుతుండగా.. ఇప్పుడు ఎన్జీటీ ఆదేశాలతో బ్రేక్ వేయాల్సి వస్తోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు.

Next Story

Most Viewed