రాజ్యసభ ఎంపీల ప్రమాణ స్వీకారం

by Shamantha N |
రాజ్యసభ ఎంపీల ప్రమాణ స్వీకారం
X

న్యూఢిల్లీ : గతనెలలో ఎన్నికైన 61 మంది రాజ్యసభ ఎంపీల్లో 45 మంది బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చాంబర్‌‌లో కొత్తగా ఎన్నికైన ఎంపీలతో చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. అందుబాటులో లేనివారికి తదుపరి తేదీలో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెడుతున్నవారిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ నుంచి శివసేనలోకి వెళ్లిన ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేత శక్తి సింగ్ గోహిల్‌లు సహా పలువురు ఉన్నారు.

శరద్ పవార్, మల్లిఖార్జున్ ఖర్గే, దిగ్విజయ్ సింగ్, రామ్‌దాస్ అథవాలే సహా పలువురు సీనియర్ నేతలు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. బుధవారం బీజేపీ నుంచి 19మంది ఎంపీలు ప్రమాణం చేశారు. దీంతో రాజ్యసభలో బీజేపీ తన బలాన్ని పెంచుకున్నప్పటికీ మెజార్టీ మార్కుకు దూరంగానే ఉండిపోయింది. 245 మంది సభ్యులుండే రాజ్యసభలో ఎన్‌డీఏకు సుమారు 100 మంది ఎంపీల బలమున్నది. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న బీజేడీ, ఏఐఏడీఎంకే, వైఎస్‌ఆర్‌సీపీలూ తమ బలాన్ని పెంచుకున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలు గతనెల జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story