రికార్డ్ బ్రేకింగ్ గా శీతాకాల ఉష్ణోగ్రతలు.. అప్రమత్తం కాకపోతే అంతే సంగతులు

by Shyam |   ( Updated:2021-09-07 04:30:54.0  )
రికార్డ్ బ్రేకింగ్ గా శీతాకాల ఉష్ణోగ్రతలు.. అప్రమత్తం కాకపోతే అంతే సంగతులు
X

దిశ, ఫీచర్స్: ఈ ఏడాది న్యూజిలాండ్‌లో వింటర్ సీజన్ ముగిసిపోగా, దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా న్యూజిలాండ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ప్రకారం ఆగస్టు నుండి మూడు నెలల వరకు, సగటు ఉష్ణోగ్రత 9.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు(లాంగ్‌టర్మ్ యావరేజ్) కంటే 1.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. గతేడాది రికార్డు కంటే 0.2 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

1909 నుంచి పరిశోధకులు రికార్డులను ఫైల్ చేస్తుండగా, ఇటీవల కాలంలో శీతాకాల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు గమనించారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల రోజురోజుకు వాతావరణంలో తీవ్రమైన మార్పులు జరుగుతున్నాయని, టెంపరేచర్ పెరగడానికి కూడా అదే కారణమని వాళ్లు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఉత్తరం నుంచి సాధారణం కంటే ఎక్కువ వెచ్చని గాలులు వీయడంతో పాటు, సముద్రపు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. దీంతో గత ఏడాది లాంగ్‌టర్మ్ టెంపరేచర్ యావరేజ్ 1.14 డిగ్రీ సెల్సియస్ కాగా, ఈ ఏడాది 1.32డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.

ఈ శీతాకాలంలో హిమపాతం సగటు కంటే చాలా తక్కువగా ఉండగా, కొన్ని ప్రదేశాలలో తీవ్రమైన వరదలు వస్తుండగా, ఇంకొన్ని ప్రాంతాల్లో కరువు వాతావరణం ఉంది. క్లైమేట్ చేంజ్ వల్ల సహజ పర్యావరణ వ్యవస్థలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దీని ప్రభావంతో కాలక్రమేణా మరిన్ని జాతులు అంతరించిపోతాయి. వినాశనానికి ఎన్నో సంకేతాలు అందుతున్నాయి. మనమంతా వెంటనే అప్రమత్తం కావాలి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల రేటును తగ్గించడం మనకు, జీవకోటికి అత్యవసరం.
– ప్రొఫెసర్ జేమ్స్ రెన్విక్, వాతావరణ శాస్త్రవేత్త

Advertisement

Next Story