పోలింగ్ శాతం వెల్లడిలో ఊహించని ట్విస్ట్

by Anukaran |   ( Updated:2020-12-02 00:59:49.0  )
పోలింగ్ శాతం వెల్లడిలో ఊహించని ట్విస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రమంతా నిర్వహించే ఎన్నికల లెక్కలేవైనా అర్థరాత్రి 12 గంటలలోపు పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తారు. ఇది చాలా ఎన్నికల్లో తెలిసిన అంశమే. అందుకే ఎవరైనా ఈ పోలింగ్ శాతం కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అర్థరాత్రి ప్రకటించి తెల్లారేసరికి గ్రామాలు, వార్డుల వారీగా పోలైన ఓట్ల లెక్కలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఈసారి గ్రేటర్‌లో నిర్వహించిన పోలీంగ్‌లో అంతా గందరగోళం నెలకొంది. లెక్కలు తారుమారవుతున్నాయి. అంచనాతో వేస్తున్నారా… అధారాలతో చెప్పుతున్నారా.. అనే విషయం తేలడం లేదు. ఫలితంగా రాత్రి ఓ శాతం, తెల్లారేసరికి మరో శాతంతో పోలింగ్ నమోదును ప్రకటిస్తున్నారు. అంతా ప్రకటించిన తర్వాత మళ్లీ పూర్తి జాబితా డిప్యూటీ కమిషనర్ల సంతకాలతో నివేదిక రావాల్సి ఉంటుందంటూ చెప్పుతున్నారు.

అసలెంత శాతం..?

గ్రేటర్ పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అంచనాలకు అందడం లేదు. ఎలా మారిందో కూడా తెలియడం లేదు. మంగళవారం అర్థరాత్రి వరకు ముందుగా 45.70 శాతం పోలింగ్ జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి ప్రకటించారు. గత రెండు పర్యాయాలు నమోదైన ఓట్ల శాతంతో పోలిస్తే ఈసారి 0.50 శాతం ఎక్కువ జరిగినట్లు వెల్లడించారు. ఇక అదే ఫైనల్ అనుకున్నారు. కానీ బుధవారం ఉదయం ఎన్నికల సంఘం నుంచి మరో అనధికారిక సమాచారమిచ్చారు. ఇది ఫైనల్ కాదంటూ పేర్కొంటూనే ఫైనల్ అన్నట్టే చెప్పుకొచ్చారు. బుధవారం ఉదయం వరకు పూర్తిస్థాయిలో లెక్కించామని, ఈ లెక్కల ప్రకారం పోలింగ్ శాతం 46.6గా వెల్లడైనట్లు చెప్పుతున్నారు. అంతలోనే మళ్లీ తాత్కాలికమైనదిగానే భావించాలంటూ చెబుతున్నారు. అసలు పోలింగ్ ఎంత శాతం నమోదైందనే విషయాన్ని ఇంకా స్పష్టం చేయడం లేదు.

దాచి దాచి చెప్పాల్సిందే..

ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హెచ్చరికలు జారీ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకేసారి పోలింగ్ శాతం పెరిగినట్టుగా ప్రకటించకుండా కొద్దికొద్దిగా ప్రకటించాలని, ఒకేసారి ప్రకటిస్తే చాలా అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశాలుంటాయని సూచించారు. ఎలాగూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకునే ఎన్నికల సంఘం ప్రభుత్వ సూచనలను తూ.చా తప్పకుండా పాటిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పాతబస్తీలో తక్కువ పోలింగ్ నమోదు

తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాల్లో పాతబస్తీలో 9 డివిజన్లు ఉన్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. మెహదీపట్నం, సైదాబాద్, సంతోష్ నగర్, మూసారంబాగ్, విజయ్‌నగర్ కాలనీ, అజంపుర, అక్భర్‌బాగ్, డబీర్‌పురా, ఐఎస్ సదన్‌లో తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని డివిజన్లు ఉన్నాయి. మియాపూర్, హైదర్‌నగర్, మాదాపూర్, చందానగర్, హఫీజ్‌పేట్, అల్విన్ కాలనీలో తక్కువ పోలింగ్ నమోదైంది.

మొత్తం ఓట్లు 74,44,260

పురుషులు 37,77,688
మహిళలు 36,65,896

ఓటు వేసిన‌వారు ఇలా

పురుషులు 18,57,041
మ‌హిళ‌లు 15,97,438
ఇత‌రులు 73
మొత్తం 3454552

అత్య‌ధిక పోలింగ్ న‌మోదైన‌వి..

కంచన్‎బాగ్ -70.39%
ఆర్సీపురం -67.71%
ప‌టాన్‌చెరు -65.77%
భార‌తిన‌గ‌ర్ -61.89%
గాజుల‌రామారం -58.61%
నవాబ్‌ సాహెబ్‌ కుంట -55.65%
బౌద్ధనగర్‌ -54.79%
దత్తాత్రేయ నగర్‌ -54.67%
రంగారెడ్డిన‌గ‌ర్ -53.92%
జంగంమెట్ -53.8%

అత్య‌ల్ప పోలింగ్ న‌మోదైన‌వి..

యూసుఫ్‌గూడ -32.99%
మెహదీపట్నం -34.41%
సైదాబాద్ -35.77%
సంతోష్‌‌ నగర్‌ -35.94%
మియాపూర్ -36.34%

10 నుంచి 40 శాతం లోపు పోలింగ్ నమోదైన డివిజన్లు : 17
40నుంచి 50 శాతంలోపు పోలింగ్ నమోదైన డివిజన్లు : 93
50శాతానికిపైగా పోలింగ్ నమోదైన డివిజన్లు : 39

Advertisement

Next Story