జీహెచ్ఎంసీలో కొత్త ఒరవడి..మంత్రులే అధికార ప్రతినిధులు.!

by Shyam |   ( Updated:2021-05-16 10:57:43.0  )
జీహెచ్ఎంసీలో కొత్త ఒరవడి..మంత్రులే అధికార ప్రతినిధులు.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ ​మున్సిపల్​ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పౌరసేవల సంస్థ. రాష్ట్రంలోని మూడో వంతు జనాభా నివసించే హైదరాబాద్‌లో ప్రజలకు సేవలందించడంలో ముందుండే బల్దియాలో అధికారులు చేపడుతున్న పనుల వివరాలను కూడా బయటకు చెప్పకూడదనే ఆంక్షలను తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న పలు కార్యక్రమాల వివరాలను అధికారికంగా చెప్పేందుకు కమిషనర్, ఆయా విభాగాల ఇన్‌చార్జీలకు సైతం అధికారం లేకుండా పోయింది. గతేడాది వరదల సమయం నుంచి ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

గతంలోనూ వరదలతో నష్టపోయిన వారిని గుర్తించడం, సాయాన్ని అందించడం, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి వాటిని జీహెచ్ఎంసీ చేపట్టింది. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా ఎంతమంది నష్టపోయారో, ఎందరు మరణించారో, వారికి ప్రభుత్వం నుంచి ఎంత సాయమందించారోననే అంశాలపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ప్రకటించలేదు. స్వయంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​మీడీయా సమావేశం నిర్వహించి గణంకాలు చెబితే తప్ప జీహెచ్ఎంసీ అధికారుల పని బయటపడలేదు. బల్దియా అధికారులు మాట్లాడకుండా కేవలం మంత్రులు మాత్రమే వచ్చి గణంకాలను చెబుతుండటం కొత్త సంస్కృతిగా కనిపిస్తోంది.

వరదల సమయంలో కేటీఆర్​వచ్చి వివరాలు తెలపగా.. ప్రస్తుతం ఆ బాధ్యతలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్, మహ్మద్​అలీ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా సమయంలో సాగుతున్న ఫీవర్ సర్వే వివరాలు, ఎంతమందికి జ్వర లక్షణాలు ఉన్నాయో, ఎంతమందికి ఐసోలేషన్‌లో సేవలందిస్తున్నారో, వ్యాక్సినేషన్ తీరు, అందుబాటులో ఉన్న బెడ్స్ వివరాలను తెలిపేందుకు సోమవారం జీహెచ్ఎంసీకి రానున్నారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కలెక్టర్లు కూడా పాల్గొంటారని ముందస్తుగా ప్రకటించారు.

రెండు వారాలుగా సిటీలో ఫీవర్ సర్వే కొనసాగుతున్నా ప్రతీ రోజూ సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రెస్ రిలీజ్​ఇస్తోంది. ఇందులో సర్వేలో పాల్గొంటున్న బృందాలు.. ఇన్ని ఇండ్లల్లో సర్వే చేస్తున్నాయనే వివరాలు ఇస్తున్నారు తప్ప వీరిలో ఎందరికి జ్వరం, కొవిడ్​ లక్షణాలు ఉన్నాయో, ఎందరికి మెడిసిన్స్ ఇచ్చారో గణంకాలను ఇవ్వడం లేదు. ప్రతీ రోజూ సర్వే ముగిసిన తర్వాత అధికారులకు ఈ వివరాలు చేరుతాయి.. అయినా వీటిని ప్రకటించేందుకు జీహెచ్ఎంసీ అధికారులకు అధికారం లేకుండా పోయింది. ప్రతీసారి మంత్రులు వచ్చి చెబితే తప్ప జీహెచ్ఎంసీలో ఏ మేరకు పనిజరుగుతుంతో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో వరదల సమయంలో కేటీఆర్ చెప్పేవరకూ అధికారులు పెదవి విప్పలేదు. ఇప్పుడు ఈ సర్వే విషయంలోనూ అదే ధోరణిని కొనసాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

1,563 బృందాలతో 1,37,969 ఇండ్లల్లో సర్వే..

గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన 1,563 బృందాలు ఆదివారం 1,37,969 ఇండ్లల్లో సర్వే పూర్తి చేశాయి. ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్‌తో కూడిన బృందాలు ఇంటింటి ఫీవర్ సర్వేను గత రెండు వారాలుగా చేపడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 8,38,970 ఇళ్లలో సర్వే పూర్తి చేసినట్టు జీహెచ్ఎంసీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. బస్తీ దవాఖానా, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావఖానాల్లో ఆదివారం రోజు 5,396 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటివరకు ఆసుపత్రుల ద్వారా మొత్తం 1,93,900 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్‌కు కేవలం కరోనా సంబంధిత సలహాలు, సూచనలకు వచ్చిన ఫోన్ కాల్స్‌కు ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించారు. జ్వర కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటి లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు.

Advertisement

Next Story