- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిద్రలేమితో న్యూ ప్రాబ్లమ్స్.. నివారణ ఇలా!
దిశ, వెబ్‌డెస్క్: రాత్రుళ్లు పడుకుంటే నిద్ర రావడం లేదా.. తెల్లవారు జామువరకు తెలివితోనే ఉంటున్నారా? అలా చేస్తే తప్పకుండా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. హాయిగా నిద్రిస్తేనే సమస్యలు దూరం అవుతాయని.. నిద్రను అతిగా ప్రేమించినా, అతిగా దూరం చేసుకున్నా రెండూ మంచివి కావంటున్నారు. ఆరోగ్యం సరిగా లేనప్పుడే నిద్రలేమి సమస్యలు వస్తాయి. రాత్రి సరిగా నిద్ర పట్టదు. మంచి నిద్ర వల్లే ఆధునిక ప్రపంచంలో మానవుడు అన్నింటిని జయించేందుకు అవసరమైన స్థైర్యం వస్తుంది. నిద్రమత్తు మనిషిని చిత్తు చేస్తుంది. అయితే నిద్రలేమి మనిషి ఉనికికే సవాలుగా మారే అవకాశం ఉంది.
చాలామంది పని ఒత్తిడి వల్లనో, మారుతున్న జీవన ప్రమాణాలకు అలవాటు పడో సరైన నిద్ర లేక బాధపడుతుంటారు. అలాంటి వారు రాత్రిపూట ప్రశాంతంగా ఎలా నిద్రపోవాలి, నిద్రలేమి నుంచి తప్పించుకోవాలంటే నిపుణనుల సలహా తప్పక పాటించాలి.
నిద్ర వలన కలిగే లాభాలు..
కంటినిండా నిద్రపోయినరోజున మనం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. సరిగ్గా నిద్రపోని రోజు చిరాకు, ఒత్తిడి లాంటివి వెంటాడుతుంటాయి. కంటినిండా నిద్రపోతే ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆ రోజు మూడ్ కూడా బాగుంటుంది. ఏ పని అయినా చకచకా చేసేస్తాం. నిద్రలేమి వల్ల గుండెకు సంబంధించిన జబ్బులు కూడా వచ్చే అవకాశముంది. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. నిద్రలేమివల్ల మనిషిలోని డీఎన్‌ఏ పాడవుతుందని ఇటీవల చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. అయితే, ప్రశాంతంగా నిద్రపోవడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదని నిద్రలేమితో బాధపడుతున్న వారు చెబుతున్నారు.
నిద్రలేమితో సమస్యలు..
కొంత మందికి కళ్లు మూయగానే నిద్రలోకి జారుకుంటారు. మరికొంత మంది కళ్లు మూసిన ఆరగంట, గంట సేపటికి గానీ నిద్రపట్టదు. దీనికి చాలావరకు మానసిక ఒత్తిడే కారణం. ప్రతిచిన్న విషయానికీ ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా రియాక్ట్ అవడం వంటి కారణాలు కూడా నిద్రకు దూరం చేస్తాయి. నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి వలన మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని పరిశోధకులంటున్నారు. ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని అనేక పరిశోధనల్లో తేలింది.
అందుకే సరిపడా నిద్రలేకపోతే ఆ వ్యర్ధకణాలు మెదడులో పేరుకుపోయి, అది అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. నిద్రలేమికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 153 అధ్యయనాల్లో 50 లక్షలమందికి పైగా పాల్గొన్నారు. ఇందులో చాలామంది నిద్రలేమితో బాధపడేవారికి మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలాయి. యుక్తవయసులో వరుసగా కొన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపితే అది మధుమేహానికి దారి తీస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
అధిక బరువు పెరగడం..
నిద్రలేమి వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతిని, రోగనిరోధక వ్యవస్థ పాడవుతుంది. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. 7 గంటలకన్నా ఎక్కువ నిద్రపోయే వారికన్నా, తక్కువ నిద్రపోయేవారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ అధికంగా విడుదలై ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని, కడుపు నిండిందనే భావన కల్పించే హార్మోన్ లెప్టిన్ తక్కువగా విడుదలై మరింత ఆహారం తినే విధంగా చేసి ఊబకాయానికి దారితీస్తుంది. నిద్రలేమివల్ల మలబద్దకం, డిప్రెషన్, కోపం, చిరాకు ఎక్కువవుతాయి. ఇది చివరికి ఎనిమీయాకు దారి తీస్తుంది.
కునుకుతో రెట్టింపు ఉత్సాహం..
మనిషి ఆహారం లేకుండా రెండు నెలలైనా ఉండగలడు. కానీ నిద్ర లేకుండా ఉండటం కష్టం. జపాన్‌లో ఉద్యోగుల పనివేళల్లో మధ్యాహ్నం ఓ పదినిమిషాలు కునుకు తీయడం కూడా ఎనర్జీని పెంచే టానిక్ లాంటిదే. అలసిపోయినప్పుడు కొద్దిసేపు నిద్రపోయి లేస్తే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. అందుకే పనివేళల్లో మధ్యమధ్యలో కొంచెంసేపు నిద్రపోయేందుకు అక్కడి కంపెనీలు ప్రోత్సహిస్తాయి. ఎక్కువ ఎత్తులో నిద్రపోవడంవల్ల ఆక్సిజన్ సరిపడినంత అందక నిద్రలేమి ఏర్పడుతుంది. ఆహారలేమి కంటే నిద్రలేమే మనిషిని తొందరగా చంపేస్తుంది.
ఎంత నిద్ర అవసరం ?
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందడంలో నిద్ర ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే 8గంటల నిద్ర అవసరం. ప్రపంచస్థాయి ఆరోగ్యసంస్థలు కూడా 8 గంటలు తప్పక నిద్రపోవాలని చెబుతున్నాయి. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది. 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే తక్కువ నిద్ర అంటారు. 10 గంటల కన్నా ఎక్కువ నిద్రపోతే అధిక నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్రపోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇలా చేస్తే హాయిగా పడుకోవచ్చు..
ముందుగా మానసిక ఒత్తిడిని జయించాలంటే యోగా, మెడిటేషన్, ప్రాణాయామం నిత్యం అవసరం. ఇలాచేస్తే మానసిక ప్రశాంతత కలిగి నిద్రలేమి తీవ్రత తగ్గుతుంది. అలాగే పడుకోవడానికి 2గంటల ముందే మంచి ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, మసాలా పదార్థాలు, వేపుళ్లకు ఫులిస్టాప్ చెప్పాలి. ఆకు కూరలు, వెజిటెబుల్స్, తాజా పండ్లు తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకుంటూ టైంకు నిద్రపోవాలి.ప్రతిరోజూ తెల్లవారు జామున లేచి 45 నిమిషాల పాటు నడవటం అలవాటు చేసుకోవాలి. తద్వారా రక్తప్రసరణ క్రమంగా జరిగి మనసు ఉత్తేజంగా ఉంటుంది.నిద్రలేమితో బాధపడేవారు తమ చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి.