భారత క్రికెటర్లకు మరో సవాల్

by Anukaran |   ( Updated:2021-01-22 07:06:35.0  )
భారత క్రికెటర్లకు మరో సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆటగాళ్లలో ఫిట్‌నెస్ మెరుగుపరిచేందుకు బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జట్టు ఎంపికలో భాగంగా యో-యో పేరుతో ఫిట్‌నెస్ టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్‌ మ్యాచుల్లో భారత్ తరఫున ఆడే ప్రతీ ఒక్క ఆటగాడు ఈ పరీక్షలో పాసైతేనే అర్హుడు. ఇందులో భాగంగానే జట్టును మరింత మెరుగుపరిచేందుకు ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మరో కఠిన పరీక్ష రంగం సిద్ధం చేస్తోంది.

టీమ్ ఇండియాలో చోటు సంపాదించడానికి.. యో-యో టెస్టులతో పాటు కొత్త ఫిట్‌నెస్‌ పరీక్షను అందుబాటులోకి తీసుకొస్తుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడు సైతం ఈ టెస్టులో ఉత్తీర్ణత సాధించకపోతే జట్టులో చోటు లభించని పరిస్థితి. ఇటువంటి టెస్టుకు బీసీసీఐ ఆమోదం తెలిపడం గమనార్హం. ఈ విధానం యువ ఆటగాళ్లకు సువర్ణావకాశమని పలువురు క్రికెటర్లు భావిస్తున్నప్పటికీ.. సీనియర్ ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ చేయాలని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి బీసీసీఐ అధికారులతో అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త ఫిట్‌నెస్ పరీక్షలో ఆటగాళ్ల సామర్థ్యంతో పాటు, వేగాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. యథావిధిగా యో-యో పరీక్షతో పాటు.. ఈ కొత్త ఫిట్‌నెస్‌ పరీక్ష కూడా తప్పనిసరి చేయనున్నారు.

కొత్త ఫిట్‌నెస్ టెస్టులో ఇవే కీలకం..

కొత్త ఫిట్‌నెస్ ‌ టెస్టులో భాగంగా.. పోలీస్ డిపార్ట్‌మెంట్ తరహాలో నిర్వహించే ఈవెంట్స్‌ వలే.. జట్టులో చోటు సంపాదించేందుకు 2 కిలో మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. ఇందులో ఫాస్ట్ బౌలర్లు 8.15 నిమిషాల్లో 2 కిలోమీటర్లు పరిగెత్తాలి. అలాగే, బ్యాట్స్‌మెన్లు ఈ రేసును 2 నిమిషాల 30 సెకన్లలో కంప్లీట్ చేయాలి. ఈ పరీక్షలను ఏడాదిలో మూడు సార్లు నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఏడాది కాలంలో ఫిబ్రవరి, జూన్‌, ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో వీటికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లలో ఫిట్‌నెస్ మెరుగుపడడంతో పాటు టీమ్ ఇండియా విజయానికి ముఖ్య పాత్ర వహిస్తోందని బీసీసీఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ సంవత్సరం ఈ టెస్టులను మరింత కఠినతరం చేసేందుకు బీసీసీఐ ప్లాన్‌ చేస్తోందని.. ఏదేమైనా భారత్ విజయం కోసమే క్రికెట్ విశ్లేషకులు సైతం సమర్థిస్తున్నారు.

ప్రస్తుతం భారత జట్టులో ఉన్న సీనియర్, హార్డ్ హిట్టర్లు ఫిట్‌నెస్‌‌లో తమను తాము నిరూపించుకున్నారు కాబట్టే.. భారత జట్టు ప్రపంచంలో కీలక జట్టుగా ఎదిగింది అన్నది నిత్య సత్యం. దీనికి తోడు యువఆటగాళ్లు సైతం ఏ మాత్రం తీసుపోకుండా.. స్వదేశీ, విదేశీ అన్న తేడా లేకుండా సత్తా చాటుతూ వస్తున్నారు. ఇందుకు నిదర్శనం మొన్న జరిగిన గబ్బా టెస్టు విక్టరీ. ఇది ఇలా ఉంటే ఇందులో సీనియర్ ఆటగాళ్ల సూచనలు, సలహాలు కూడా జట్టు విజయానికి ప్లస్ అయ్యాయి. ఇక భారత ఆటగాళ్లు ఈ కొత్త ఫిట్‌నెస్‌లో కూడా నిరూపించుకుంటే జట్టు విజయాలకు ఎదురుండదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే మంచి ఫామ్‌లో ఉన్న సీనియర్ క్రికెటర్లు గాయాలతో సతమతం అవుతున్న విషయాన్ని కూడా బీసీసీఐ పరిగణలోకి తీసుకోవాలని క్రికెట్ ప్రియులు చెప్పకనే చెప్పుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed