సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రికి కొత్త పరికరాలు

by Shyam |
సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రికి కొత్త పరికరాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుని ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్న గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించింది. నగరంలోని సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రికి రోజుకు మూడు వేల కరోనా టెస్టులు చేసే మిషన్‌ను త్వరలో పంపనున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ హామీ ఇచ్చినట్లు గవర్నర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీనికి తోడు ఐసీయూలో చికిత్స పొందాల్సిన కరోనా పేషెంట్లకు అవసరమైన పరికరాలను, వెంటిలేటర్లను కూడా సమకూర్చనున్నట్లు కేంద్ర మంత్రి వివరించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రితో సోమవారం సాయంత్రం జరిగిన టెలిఫోన్ సంభాషణలో ఆయన నుంచి ఈ హామీ లభించినట్లు తెలిపారు.

నగరంలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో సైతం మరిన్ని టెస్టులు చేయడంతో పాటు కరోనా పేషెంట్లకు చికిత్స అందించే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి గవర్నర్ తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే లబ్ధిదారులకు మాత్రమే ఈ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిగే అవకాశం ఉందని, అయితే ఈ సౌకర్యాన్ని ఆ పరిధిలోకి రాని పేదలకు కూడా ఉచితంగా అందజేయడానికి ఉన్న అవకాశాలపై ఆలోచించి సానుకూలంగా స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులు ఉన్నారని, పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తూ ఆ పరిధిలోకి రాని ఇతరులకు నామమాత్రపు ఛార్జీలను వసూలుచేసి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని కేంద్ర మంత్రికి గవర్నర్ వివరించారు.

ఈ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి కొత్త యంత్రాన్ని త్వరలో అందజేయడంతో పాటు ఐసీయూలో ఉపయోగపడే కొన్ని ఉపకరణాలను, వెంటిలేటర్లను కూడా అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రికి గవర్నర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Next Story