- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి తరపు ‘సోషల్ డైలమా’
దిశ, వెబ్‌డెస్క్: ఒక టీనేజీ అమ్మాయి.. తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ, రెండు చేతులతో చెవులను బయటికి వచ్చేలా బలంగా లాగుతోంది. అవి ముఖం నుంచి బయటికి ఊడిపోయి వస్తాయన్నంత బలంగా లాగుతోంది. అలా లాగి లాగి.. ఒక్కసారిగా రెండు చేతులతో ముఖాన్ని మూసుకుని ఏడుస్తుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘సోషల్ డైలమా’ డాక్యుమెంటరీలోని ఒక సన్నివేశం ఇది. ఆమె ఎందుకు అలా చెవులను లాక్కుంటుందో అర్థమైందా? కారణం.. సోషల్ మీడియా. ఆరోజు ఉదయాన్నే ఆ అమ్మాయి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫొటో పెట్టింది. ఆ ఫొటో కింద ఎవడో ‘నీ చెవులు ఇంకొంచెం బయటకి ఉండే బాగుండేది’ అని కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌ను కొన్ని వందల మంది లైక్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి ఏదో ఒక సోషల్ మీడియా ఖాతా ఉంది. దాని వాడకం వల్ల ప్రతికూల ప్రభావాలు తెలిసినప్పటికీ వాడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా ఇలా ఎదగడానికి గల కారణాలను, వాటి మెకానిజంను ఈ డాక్యుమెంటరీలో క్షుణ్నంగా వివరించారు. వేరెవరో వివరిస్తే మనకు మెదళ్లకు ఎక్కదు కాబట్టి, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్ మీడియా యాప్‌ల తయారీలో భాగస్వాములైన వారే ఈ డాక్యుమెంటరీలో వాటి ప్రతికూల ప్రభావాలను వివరించారు.
రూపకల్పనలో భాగమైన వారే ఇలా చెప్పడంతో తమ సోషల్ మీడియా ఖాతాలు వాడాలా వద్దా? అని ఇప్పుడు అందరూ ఆలోచనలో పడ్డారు. ఫేస్‌బుక్ లైక్ బటన్ సహసృష్టికర్త జస్టిన్ రోసెన్‌స్టీన్ చెప్పిన మాటలు వింటుంటే ఈ సోషల్ మీడియా మనల్ని ఎలా బానిసగా చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా వెబ్‌సైట్‌ల ప్రధాన లక్ష్యం ప్రకటనలు. ఏ ప్రకటనలు పడితే ఆ ప్రకటనలను అందరూ చూడరు. కాబట్టి ముందు వాళ్లకి ఎలాంటివి నచ్చుతాయో తెలియాలి. అందుకోసం వారి అభిరుచికి తగ్గట్టుగా వారి సోషల్ మీడియా ఖాతా ఉండాలి. వారి అభిరుచి తెలియాలంటే వారు లైక్ చేసేది ఏదో తెలియాలి. అందుకే లైక్ బటన్ అనేదాన్ని సృష్టించినట్లు రోసెన్‌స్టీన్ అంటున్నారు. ఇష్టమైన వాటివైపు ఆసక్తిని చూపించడమనే మానవ సైకాలజీని టెక్నాలజీ అల్గారిథమ్‌లతో మేళవించి ప్రకటనల ద్వారా ఆదాయం పొందే ఉద్దేశంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల రూపకల్పన జరిగిందని ఈ డాక్యుమెంటరీలో నిపుణులు చెబుతారు.
కానీ ఫేక్ న్యూస్ ఈ ఉద్దేశం కారణంగా ఎలాంటి మలుపులు తిరిగిందో కూడా ఈ డాక్యుమెంటరీలో వివరించారు. కేవలం ఇంటర్నెట్‌కు స్మార్ట్‌ఫోన్‌కు మాత్రమే పరిమితం అవ్వాల్సిన ఈ సోషల్ మీడియా.. వాస్తవిక ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం ఫేక్ న్యూస్. సాధారణ వాస్తవ వార్త కంటే ఈ ఫేక్ న్యూస్ ఆరు రెట్లు వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ఈ డాక్యుమెంటరీలో ఉదాహరణతో సహా చూపించారు. ఈ ఫేక్ న్యూస్ కారణంగా సామాజిక యుద్ధం ప్రారంభమవుతుందేమోనని తాను చాలా సార్లు భయపడినట్లు గతంలో ఫేస్‌బుక్ సంస్థలో పనిచేసిన టిమ్ కెండాల్ ఈ డాక్యుమెంటరీలో చెప్పారు. ఈ 90 నిమిషాల డాక్యుమెంటరీలో టిమ్ కెండాల్, రోసెన్‌స్టీన్ లాంటి సోషల్ మీడియా నిపుణులు దాని ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ డాక్యుమెంటరీని చూసిన వారందరూ తమ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేస్తున్నారు. మరి ఈ డాక్యుమెంటరీ కారణంగా ప్రపంచాన్ని శాసిస్తున్న సోషల్ మీడియా మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు!