- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TTD:పున్నమి వెలుగులో రాములవారి కల్యాణం.. విస్తృత ఏర్పాట్లు

దిశ, తిరుమల/ఒంటిమిట్ట: పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో సీతా లక్ష్మణ సమేతుడై సంచరించారు. సీతాదేవి దప్పిక తీర్చడానికి భూమిలోకి బాణం వేయగా నీటి బుగ్గ పడింది. అదే ఒంటిమిట్టలోని రామతీర్థమైంది. సీత అన్వేషణ కోసం రావణ సంహారం కోసం శ్రీరామచంద్రునికి సహకరించిన హనుమంతుని పరివారంతో పాటు జాంబవంతుడు కూడా ఉన్నారు.
ఆ జాంబవంతుడు సేవించిన సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట ఆలయంలో కొలువై ఉన్నారు. ఒకే రాతిపై శ్రీ సీత రామ లక్ష్మణ దేవత మూర్తులు ఉండడంవల్ల ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఈ దేవాలయ నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయినట్లు ఆలయంలో ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి. 1356 లో బుక్కరాయలు, ఆ తర్వాత కాలంలో విజయనగరాజులు, మట్లి రాజులు క్రమంగా గుడి అంతరాలయం, రంగ మండపం, మహా ప్రాంగణం, గోపురాలు నిర్మించారు.
ఆంధ్రా భద్రాచలం అయిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంను రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2015, సెప్టెంబరు 9న టిటిడి ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి పురాతన చారిత్రక ప్రాశస్త్యం గల రామాలయంను ఆర్కియాలజి సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకుని ఆలయం లోపల, బయట టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రతి ఏడాది శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వంగా సుందరంగా కల్యాణ వేదిక, కల్యాణాన్ని వీక్షించే భక్తుల సౌకర్యార్థం షెడ్లు, మరుగుదొడ్లు, యాత్రీకుల వసతి సముదాయాలు నిర్మించారు. అదేవిధంగా ఆలయ లోపల పోటు, యాగశాల, పరిసరాల మరమ్మత్తులు, నూతన పుష్కరిణి, వాహన మండపం నిర్మాణం, మాడ వీధులలో సిసి రోడ్లు, డ్రైనేజి తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మరింత అహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు పరిసరాలలో పచ్చదనం పెంపొందించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు ఆధ్వర్యంలో, జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం పర్యవేక్షణలో ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పున్నమి వెలుగులో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కల్యాణానికి విచ్చేసే లక్షలాధి మంది భక్తులకు అవసరమైన తాగునీరు, అన్నప్రసాదాలు, భద్రాత, రవాణా, వైద్యం, పారిశుద్ధ్యం, పార్కింగ్ తదితర అంశాలపై టీటీడీ, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేస్తోంది.
రాములవారిపై సాహిత్యం :
ఎందరో మహాకవులు తన సాహిత్యం ద్వారా శ్రీరామచంద్రుని కరుణకు పాత్రులయ్యారు. పోతన ఇక్కడే భాగవతాన్ని అనువదించినట్టు తెలుస్తోంది. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీర శతకము చెప్పారు. రామభద్రుడు ‘రామాభ్యుదయం’ రచించారు. నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని వరం పొంది వరకవి అయ్యారు. ఉప్పు గొండూరు వేంకటకవి ఒంటిమిట్ట దశరథరామ శతకము చెప్పారు. వావిలికొలను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని మందర వ్యాఖ్యతో రచించారు. తాళ్ళపాక అన్నమయ్య రామునిపై పలు సంకీర్తనలు ఆలపించారు