Kesombine Culture : ఒకే గదిలో భార్యా భర్తలు.. కానీ వేర్వేరుగా..

by Javid Pasha |
Kesombine Culture : ఒకే గదిలో భార్యా భర్తలు.. కానీ వేర్వేరుగా..
X

దిశ, ఫీచర్స్ : భార్యా భర్తలన్నాక సహజంగానే ఏ దేశంలోనైనా రాత్రిళ్లు ఒకే బెడ్‌పై కలిసి నిద్రిస్తుంటారు. ఏవైనా ప్రత్యేక కారణాలు ఉన్నప్పుడో, జలుబు, జ్వరాలు వంటివి వచ్చినప్పుడో విడిగా పడుకుంటారు. కానీ జపాన్‌లో మాత్రం అలా కాదు. అక్కడి కొన్ని గ్రామీణ సంస్కృతుల్లో పురాతన జపనీస్ సంప్రదాయం ఆధునిక పద్ధతిలో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం దంపతులు ఒకే రూములో పడుకున్నప్పటికీ, ఒకే మంచం మీద మాత్రం కలిసి నిద్రించరట. దీనిని అక్కడ ‘కెసోంబైన్’ అని కూడా పిలుస్తారు.

*దంపతులు ఒకే గదిలో ఉన్నప్పటికీ రాత్రిళ్లు ఒకే మంచం మీద పడుకోకపోవడం అనేది జపాన్ సంస్కృతి లేదా ఆచారంలో భాగమని నిపుణులు చెబుతున్నారు. అలాగని దంపతుల మధ్య సాన్నిహిత్యం ఉండదని భావించాల్సిన అవసరం లేదు. కేవలం శృంగార ప్రక్రియలో పాల్గొన్నంత సేపు మాత్రమే ఒక మంచంపై ఉంటారు. ఆ తర్వాత ఎవరి దారి వారిదే. అలాగనీ ఇక్కడి జంటల్లో లవ్ అండ్ ఎమోషనల్ బాండింగ్ లేదనడానికి లేదు ఇది కాస్త ఎక్కువనట. అయితే ఈ సంప్రదాయాన్ని అందరూ పాటిస్తారా? అంటే దంపతులు విడిగా పడుకోవాలనే సంప్రదాయాన్ని కచ్చితంగా కొనసాగించాలనే నిబంధనలేవీ లేవు. ఎవరూ ఒత్తిడి కూడా చేయరు. కానీ సంప్రదాయం పేరుతో గ్రామీణ ప్రజలు దీనిని కొనసాగిస్తూ వస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

*జపాన్ ఆరోగ్య, కార్మిక సంక్షేమ మంత్రిత్వశాఖ తరపున 2019లో నిర్వహించిన సర్వేల ప్రకారం 20 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సుగల 1,662 మంది జంటలను నిపుణులు ప్రశ్నించారు. వీరిలో 29.2 శాతం మంది జంటలు మాత్రమే ఒకే బెడ్‌పై నిద్రిస్తున్నారు. మిగతా చాలా మంది ఒకే గదిలో పడుకుంటున్నప్పటికీ, కలిసి ఒకే బెడ్‌పై మాత్రం నిద్రించరు. పడుకునే సమయానికి వేర్వేరు బెడ్‌లకు మారుతారు. పైగా ఇది జపాన్‌ సంస్కృతి, సంప్రదాయంలో భాగమని, ప్రజలు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం దీనివెనుకున్న అసలు ఉద్దేశమని అక్కడి జనాలు నమ్ముతారు.

*సంస్కృతి, సంప్రదాయంతోపాటు.. కలిసి పడుకోవడంవల్ల నష్టాలు కూడా ఉన్నాయని జపాన్ ప్రజలు కొందరు నమ్ముతుంటారు. ఎందుకంటే నిద్ర సమయంలో మధ్యలో ఒకరు తరచుగా లేవడం లేదా గురకపెట్టడం, ఉదయం కాస్త ముందుగా లేవడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. అయితే ఈ పరిస్థితి భాగస్వాముల్లో ఒకరికి నిద్రా భంగం కలిగించే అవకాశం ఎక్కువని జపనీయులు చెబుతుంటారు. దీనివల్ల ఒకరు లేదా ఇద్దరు కూడా నాణ్యమైన నిద్రను కోల్పోయి అనారోగ్యాలకు గురికావచ్చునని భావిస్తారు. భార్యా భర్తలైనా సరే ఒకే గదిలో ఉన్నప్పటికీ వేర్వేరుగా నిద్రిస్తారు. ఈ పద్ధతిని ఇక్కడ ‘కెసోంబైన్’గా పిలుస్తారు. ఓ విధంగా ‘సపరేషన్ స్లీ్ప్’ వంటిదని చెప్పవచ్చు. మరి పిల్లలు పుడితే నిద్ర అలవాట్లు ఎలా ఉంటాయన్న సందేహం కూడా ఎవరికైనా కలుగుతుంది! అయితే పిల్లలు కాస్త పెద్దయ్యే వరకు ఎక్కువగా తల్లి పక్కనే పడుకుంటారు. అలాగని తండ్రివద్ద పడుకోవడానికి అభ్యంతరాలేమీ ఉండవు. కానీ అక్కడి ప్రజల వారసత్వపు అలవాట్ల ప్రకారం ఇలా చేస్తారు. ఇక కాస్త పెద్దయ్యాక పిల్లలకు కూడా వేరే మంచం కేటాయిస్తారు.

Next Story

Most Viewed