పేరుకే కరోనా కంట్రోల్ రూం.. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం

by Shyam |
పేరుకే కరోనా కంట్రోల్ రూం.. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు అవసరమైన సమాచారాన్ని, సలహాలను పొందేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఖాళీగా కనిపిస్తోంది. వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సిటిజన్స్‌కు సేవలందించాల్సిన కాల్ సెంటర్ సిబ్బంది రాకపోయినా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో కొవిడ్ వైద్య సహాయాన్ని పొందడానికి ఎవరిని సంప్రదించాలో, తగిన సమాచారం అందక ఇబ్బందులు పడే ప్రజల వేదన అరణ్య రోదనగా మారుతోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూంలో శనివారం కేవలం ఇద్దరే సిబ్బంది రోజంతా ఉండటం ఈ విషయాన్ని నిరూపిస్తోంది.

కోవిడ్‌కు సంబంధించిన అత్యవసర సేవలు, వైద్య సహాయం కోసం జీహెచ్ఎంసీ కొవిడ్ కంట్రోల్ రూం శనివారమంతా ఖాళీగా కనిపించింది. అందులో ఉన్న ఇద్దరు సిబ్బంది మాత్రమే వచ్చిన ఫోన్ కాల్స్ మాట్లాడుతూ కనిపించారు. కొవిడ్ బారిన పడిన వారు, కుటుంబ సభ్యులు సహాయం కోసం ఫోన్ చేస్తే మాట్లాడేవారు కరువయ్యారు. ప్రస్తుతం కొవిడ్ కేసులు నమోదవుతున్నా ప్రాణపాయ స్థితిలో ఉన్న వారు సహాయం కోసం కాల్ సెంటర్‌ను సంప్రదించాలంటే సమయం వృథా కానుంది. అలాంటి సమయాల్లో తగిన సహాయం లభించగాపోగా.. ఏం చేయాలో తెలియని స్థితిలో వైద్యసాయం అందక ప్రాణాలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కొవిడ్‌ను నివారించేందుకు అన్ని రకాల చర్యలు చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించినా జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు.

సెలవుల్లో ఇన్‌చార్జి.. ఇష్టారాజ్యంగా సిబ్బంది తీరు

జీహెచ్ఎంసీ కొవిడ్ కంట్రోల్ రూం మూడు షిప్టుల్లో 24 గంటల పాటూ పనిచేస్తుంది. ఇందులో పనిచేసేందుకు ప్రతీ షిప్టులో వైద్యారోగ్య శాఖ నుంచి ముగ్గురు, జీహెచ్ఎంసీ నుంచి ముగ్గురు సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది ఇష్టానుసారంగా డ్యూటీలకు హాజరవుతున్నట్టు సమాచారం. కొందరు విధులకు కూడా హాజరు కావడం లేదు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ రెండు షిప్టుల్లో పని చేయాల్సి ఉండగా.. కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే కనిపించారు. రెండు విభాగాల నుంచి ఒక్కొక్కరు మాత్రమే విధుల్లో ఉన్నారు.

కొవిడ్ కంట్రోల్ రూమ్‌ ఇన్‌చార్జి అధికారి అనురాధ అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా సెలవుల్లో ఉన్నారు. ఆమె సెలవుల్లో ఉన్నప్పటి నుంచి కంట్రోల్ రూం సిబ్బంది ఈ విధంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ రోజూ వెల సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం సేవలు ప్రజలకు అత్యవసరమవుతాయి. ఇలాంటి స్థితిలో.. సిబ్బంది డ్యూటీలకు రాకపోవడంతో ప్రజలకు సహాయాన్ని అందించేవారు లేకుండా పోయారు. నిత్యం జీహెచ్ఎంసీ కమిషనర్ సహా అన్ని విభాగాల ఉన్నతాధికారులు కంట్రోల్ రూం పక్కనుంచే తమ కార్యాలయాలకు వెళ్తుంటారు. అయినా సిబ్బంది రాకపోతుండటంపై దృష్టి సారించకపోవడం విశేషం. కంట్రోల్ రూం ఇన్‌చార్జి ఆఫీసర్ సెలవులో ఉంటే నగర ప్రజల ప్రాణాలు గాలిలో దీపంగా మారిపోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి కంట్రోల్ రూమ్‌ను గాడిలో పెట్టి ప్రజలకు సేవలందించేలా చూడాల్సిన అవసరముంది.

Advertisement

Next Story