నెగెటివ్ ​క్యాంపెయిన్​ కొంపముంచుతోంది…

by Anukaran |   ( Updated:2021-06-03 23:54:22.0  )
నెగెటివ్ ​క్యాంపెయిన్​ కొంపముంచుతోంది…
X

దిశ, ఏపీ బ్యూరో: నెగెటివ్​ క్యాంపెయిన్​అన్ని వేళలా పనికిరాదు. ప్రజలంతా పాజిటివ్ ​మూడ్‌లో ఉన్నప్పుడు నెగెటివ్​ క్యాంపెయిన్​చేస్తే అసలుకే మోసం. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవశాలికి ఈమాత్రం అవగాహన లేదా ! ఏక వ్యక్తి ప్రభావంతో నడిచే ప్రాంతీయ పార్టీలకు వాళ్ల నిర్ణయాలే కొన్ని సందర్భాల్లో భస్మాసుర హస్తంగా మారుతుంటాయి. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రస్తుతం అలాంటి తిరోగమనస్థితిలోకి జారిపోతోంది. గురువారం పార్టీ శ్రేణుల ఆన్​లైన్​సమావేశంలో చంద్రబాబు ప్రసంగం పార్టీని ప్రజల్లో సజీవంగా నిలబెట్టేదిగా లేదు. అందులో కొన్ని అంశాలను పరిశీలిస్తే..

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఒకే రోజు ఇవ్వడమనేది ఓ చారిత్రక ఘట్టం. గతంలో ఎవరూ ఇలా చేయలేదు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు సీఎం జగన్ ​స్పష్టం చేశారు. రూ.50 వేల కోట్లతో రెండు దశల్లో 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామన్నారు. మొదటి దశలో సుమారు రూ. 28 వేల కోట్లతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. దీనిపై చంద్రబాబు కామెంట్స్​ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసింది. బడ్జెట్ లో ఐదు వేల కోట్లు కేటాయించి రూ.50 వేల కోట్లతో ఎలా ఇళ్ల కడతారనేది ఆయన ప్రశ్న. ఈ మొత్తం రెండు దశల్లో దాదాపు మూడేళ్లలో నిర్మించే ఇళ్లకు అయ్యే వ్యయాన్ని ఒక ఏడాది బడ్జెట్‌లో ఎలా చూపిస్తారనేది చంద్రబాబు అవగాహనా లోపమా లేక కావాలని ప్రజలను పక్కదారి పట్టించడమో అర్థం కావడం లేదు.

మొదటి దశ ఇళ్ల నిర్మాణం పూర్తికి జూన్​2022 గడువుగా ప్రభుత్వం పేర్కొంది. అంటే వచ్చే ఏడాది బడ్జెట్లో కూడా మరికొంత కేటాయించి మొత్తం రూ.28 వేల కోట్లు వెచ్చించే అవకాశముంది. రెండో అంశం గృహ నిర్మాణంలో సింహభాగం పీఎంఏవై కింద నిర్మించేవే. దానికి నిధులన్నీ కేంద్రం సమకూరుస్తుంది. ఒక్కో ఇంటికి రూ.1.8 లక్షలు కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇంటి స్థలాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర నిధులే వస్తాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటు సమకూరిస్తే సరిపోతుంది. ఇదీ అసలు సంగతి. పేదలంతా తమకు చిన్నదైనా సొంతిల్లు ఏర్పడుతుందనే సంబరాల్లో ఉంటే చంద్రబాబు వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లున్నాయి. ఈపాటికే కొన్ని చోట్ల టీడీపీ నేతలు ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములపై కోర్టుల్లో కేసులు వేశారు. అక్కడ పేదలు తమకు ఇంటి పట్టా దక్కకుండా చేశారని టీడీపీ నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు.

వాస్తవానికి ప్రజల్లో ఉన్న ఈ పాజిటివ్​మూడ్​లోకి చంద్రబాబు పరకాయ ప్రవేశం చేయలేకపోయారు. అహం అడ్డొచ్చినట్టుంది. ఒకవేళ పాజిటివ్​క్యాంపెయిన్ చేస్తే కొంతమేరయినా ప్రజల్లో ఆలోచన రేకెత్తేది. ప్రస్తుతం ప్రభుత్వం అర్బన్​పేదలకు సెంటు, గ్రామీణ పేదలకు సెంటున్నర స్థలంలో పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తోంది. ఇంటి జాగాను అర్బన్​లో సెంటున్నర, గ్రామాల్లో రెండు సెంట్లన్నా ఉండాలి. గ్రామీణ పేదలు గేదె, మేకలు, కోళ్లు పెట్టుకొని జీవిస్తారు. వాళ్లకు సెంటున్నర స్థలం సరిపోదు. ఈ డిమాండును టీడీపీ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తే ఇళ్ల లబ్ధిదారులు సానుభూతి చూపించేవాళ్లు. ఇంకా ఇంటి నిర్మాణంలో అదనపు సౌకర్యాలను చేర్చాలని సూచనలు ఇచ్చి ఉంటే సంతోషించేవాళ్లు. కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా టీడీపీ పట్ల కొంత సానుకూల దృక్పథం ఏర్పడేది.

ఇళ్ల విషయమే కాదు. ఇంకా కరోనాపై సరైన అవగాహనతో ఉన్నట్లు కనిపించలేదు. కరోనా ప్రాణాలు హరించేంత తీవ్రమైన వైరస్​కాదు. ఎన్ని వేవ్​లు వచ్చినా ఒక్క శాతం మరణాలరేటుకే అది పరిమితం. కొవిడ్ ను అరికట్టేందుకు ఇప్పటికి ఇంకా అనేక చికిత్సలు ప్రయోగ దశను దాటలేదు.. కేవలం ప్రజల్లో ఉండే ఇమ్యూనిటీయే ఇప్పటిదాకా కాపాడుతుందని నిపుణులు తేల్చారు. ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తే ఇమ్మూనిటీ తగ్గిపోయి తేలిగ్గా వైరస్​బారినపడతారు.

ప్రజల్లో వైరస్​ భయాన్ని పెంచి కార్పొరేట్​ఆస్పత్రులు దోచుకుంటున్నాయనేది మెజారిటీ ప్రజల అవగాహన. చంద్రబాబు వ్యాఖ్యలు దీనికి భిన్నంగా ఉన్నాయి. వ్యాక్సిన్​తోనే కరోనాను అడ్డుకోవచ్చని చెప్పారు. వ్యాక్సిన్​ ఇవ్వలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమన్నారు. ఇంకా పనిచేయని రెమిడెసివర్, అంటువ్యాధి కాని బ్లాక్​ఫంగస్​గురించి ఏవేవో మాట్లాడారు. వ్యాక్సిన్​ఇచ్చే బాధ్యత నుంచి కేంద్రం వైదొలిగితే కనీసం ప్రశ్నించలేదు. ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఏం చేస్తున్నారని రాష్ర్ట ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఆయన ప్రతీ మాట ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్న తహతహ కనిపిస్తోంది. అదే ఆ పార్టీని అంపశయ్య మీదకు చేరుస్తోంది. ఈ సంగతి టీడీపీ శ్రేణులకు అర్థమై ఏం చేయలేక తల కొట్టుకుంటున్నారు.

Advertisement

Next Story