- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోకోణం: మరో బహుజన పార్టీ అవసరమా?
సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ఈ వారం వార్తల్లో నిలిచింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన అకస్మాత్తుగా వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం, 24 గంటల్లోపే ఆ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి విధుల నుంచి రిలీవ్ చేయడం అధికార, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆయన భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. సీఎం కేసీఆర్‌తో ఒక అవగాహనకు వచ్చి తన పదవికి గుడ్‌బై చెప్పారని, రాబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని, లేదంటే దళితబంధు పథకానికి ఇన్‌చార్జిగా నియమితులవుతారని ఒక వర్గం భావించింది. అలాంటిదేమీ లేదని, గురుకులాల కార్యకలాపాల విషయంలో సర్కారు జోక్యాన్ని సహించలేక మనస్తాపం చెంది పదవిని వదిలేసారని మరోవర్గం అభిప్రాయపడింది. తీన్మార్ మల్లన్నతో కలిసి ఎస్సీ-ఎస్టీ-బీసీల ఉమ్మడి వేదికగా ఉండే పార్టీని స్థాపిస్తారని కూడా కొందరు అంటున్నారు.
ఎవరేం అన్నా ప్రవీణ్ త్వరలో రాజకీయాల్లో చేరడం, దళిత సమస్యను భుజానెత్తుకోవడం ఖాయమని తేలిపోయింది. వీఆర్ఎస్‌కు అప్లై చేసిన సందర్భంగా విడుదల చేసిన లేఖలో తన భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రవీణ్ స్పష్టంగానే చెప్పారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కానని, సాంఘికన్యాయం, సమానత్వం సాధన కోసం ఫూలే-అంబేడ్కర్-కన్షీరాం బాటలో పయనిస్తానని తెలిపారు. ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం బహుజనుల ప్రయోజనాల కోసం తెలంగాణలో ఒక కొత్త పార్టీ రావడం అవసరమన్నారు. తాను రాజకీయాల్లో చేరుతానని, ఎప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేసారు. తన వెనక లక్షలాది స్వేరోలు ఉన్నారని గుర్తుచేసారు. ప్రవీణ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో మరోసారి కొత్త పార్టీ గురించిన చర్చకు తెరలేపాయి.
ఫూలే-అంబేడ్కర్ సిద్ధాంతాల స్ఫూర్తిగా రాజకీయ పార్టీలు రావడం దేశంలో ఇదే తొలిసారి కాదు. స్వయంగా అంబేడ్కరే 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ(ఐఎల్పీ)ని స్థాపించారు. అది అంతగా ప్రజాదరణ పొందని కారణంగా 1942లో షెడ్యూలు కులాల ఫెడరేషన్‌ను ఏర్పరచి, దానిని 1956లో పార్టీగా మార్చ తలపెట్టారు. ఈ లోపలే ఆయన మరణించడంతో 1957 అక్టోబర్‌లో అంబేడ్కర్‌వాదులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ)ని ఏర్పరచారు. అదే సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ తొమ్మిది ఎంపీ సీట్లు గెలిచింది. ఆ తర్వాత చీలికలు పేలికలై ప్రస్తుతం నామమాత్రంగానే ఉనికిలో ఉన్నది.
రెండవ ప్రయత్నంగా 1984లో స్వర్గీయ కన్షీరాం బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)ని స్థాపించారు. దళితులు తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఇతర రాజకీయ పార్టీల్లో చేరడం కంటే సొంత పార్టీని ఏర్పరచుకోవడమే ఉత్తమమని ఆయన భావించారు. దళితులతో పాటు బీసీలను, మైనారిటీలను కలపడం ద్వారా ‘బహుజనులు’ అనే కొత్త సమూహాన్ని ప్రతిపాదించారు. పార్టీకి ఆ పేరే పెట్టారు. మొదటిసారి పాల్గొనే ఎన్నికల్లో ఓడిపోతామని, రెండవసారి గుర్తింపు తెచ్చుకుంటామని, మూడవసారి రాజ్యాధికారం సాధిస్తామని ప్రవచించారు. మాయావతిని సారథిగా ఎంచుకుని బహుజన జనాభా అధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్(యూపీ)లో కార్యకలాపాలను కేంద్రీకరించారు. తనే స్వయంగా సైకిల్ యాత్ర చేసి ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. యూపీ ఎన్నికల్లో పాల్గొని మొదటిసారి ఓడి, రెండవసారి కొన్ని సీట్లు సాధించి, మూడవసారి 1993లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో కలిసి అధికారాన్ని సాధించారు. ఎస్పీ, బీజేపీలతో వరసగా మూడుసార్లు సంకీర్ణ సర్కారును ఏర్పరచిన పిదప 2007 ఎన్నికల్లో తొలిసారిగా సొంతంగానే రాజ్యాధికారం దక్కించుకున్నారు. 403 సీట్లున్న యూపీ శాసనసభలో బీఎస్పీ 206 స్థానాలను గెలుచుకున్నది. బీసీల పార్టీగా ఉన్న ఎస్పీకి కేవలం 97 సీట్లు రాగా, బీజేపీకి 51 సీట్లు, కాంగ్రెస్‌కు 22 సీట్లు వచ్చాయి. ఏ కారణం వల్లనో ఆ తర్వాత బీఎస్పీ ప్రాభవం తగ్గడం మొదలైంది. 2012 యూపీ ఎన్నికల్లో 80 స్థానాలు రాగా, 2017 ఎన్నికల్లో కేవలం 19 మాత్రమే వచ్చి బొక్కబోర్లాపడింది. 1990-2020 మధ్యకాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అతికష్టం మీద సింగిల్ డిజిట్‌లో అసెంబ్లీ స్థానాలను గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇప్పటివరకూ అత్తెసరు ప్రతిభనే కనబర్చడం గమనార్హం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఎస్పీ తొలినాళ్లలోనే ప్రవేశించినా ఎప్పుడూ తన ఉనికిని చాటుకోలేకపోయింది. 1990లలో ఇక్కడి దళితుల్లో బీఎస్పీ ఊపు కనిపించినా, అది ఓటుబ్యాంకుగా మాత్రం మారలేదు. ప్రధాన పార్టీల టిక్కెట్ లభించని ఇద్దరు అసంతృప్తులు బీఎస్పీ గుర్తుపై పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలువడం తప్ప ఇప్పటి వరకు పాత, కొత్త రాష్ట్రాల్లో ఆ పార్టీ సాధించింది శూన్యమేనని చెప్పవచ్చు. 1994లో మంద క్రిష్ణ మాదిగ మరో ప్రయత్నం చేసారు. ఎస్సీల వర్గీకరణ లక్ష్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. సుదీర్ఘపోరాటం తర్వాత 2014లో ఆ సంస్థను ‘మహాజన సోషలిస్టు పార్టీ(ఎమ్మెస్పీ)’గా మార్చారు. ఈ పార్టీ కూడా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఇప్పటివరకూ ఎలాంటి ముద్రనూ వేయలేకపోయింది.
బహుజనుల పేరిట వచ్చిన ఆర్పీఐ కాని, బీఎస్పీ కాని, ఎమ్మెస్పీ కాని ఉద్యమాల పరంగా సఫలమయ్యాయి తప్పితే, అందుమూలంగా వచ్చిన ప్రజాదరణను ఓటుబ్యాంకుగా మార్చుకోవడంలో విఫలమయ్యాయి. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ దళితులకు స్ఫూర్తినివ్వగలిగారు తప్ప పార్టీని విజయవంతంగా నడపలేకపోయారు. కన్షీరాం కలలుగన్న దేశవ్యాప్త రాజ్యాధికారాన్ని సాధించడంలో బీఎస్పీ ఘోరంగా విఫలమైంది. ఒక్క యూపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఇప్పటివరకూ ఆ పార్టీ చెప్పుకోదగినన్ని సీట్లను గెలుచుకోలేకపోయింది. యూపీలో కూడా అధికారం కోసం జరిగిన వెంపర్లాటలో ఎస్పీ, బీజేపీలతో వరస అవకాశవాద కలయికల మూలంగా జనంలో పార్టీ ప్రతిష్ట బాగా దెబ్బతింది. ప్రస్తుతం దేశంలో కాదు కదా.. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారం సాధించే పరిస్థితిలో లేదన్నది స్పష్టం. ఇక, తెలుగు రాష్ట్రాల్లో మహాజన సోషలిస్టు పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే. పోటీ చేసిన చోట దళితవర్గాల ఓట్లలో చీలికను తేవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. మొన్నటి నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఆ పార్టీకి కేవలం 1028 ఓట్లు మాత్రమే వచ్చాయి.
బహుజన పార్టీలు విఫలం కావడానికి ముఖ్య కారణం అవి ప్రధాన స్రవంతి పార్టీలుగా రూపుదిద్దుకోలేకపోవడమే. ఆర్పీఐ అయినా, బీఎస్పీ అయినా, ఎమ్మెస్పీ అయినా ప్రజల దృష్టిలో దళిత పార్టీలుగానే మిగిలిపోతున్నాయి. పేరుకు బహుజనుల పార్టీలుగా ఉన్నా ఆచరణలో బీసీలను, ఎస్టీలను, మైనారిటీలను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆ వర్గాల కోసం ఎజెండాను రూపొందించడంలో, ఉద్యమాలు చేయడంలో, ఎన్నికల ప్రణాళికను ప్రకటించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. ఫలితంగా బీసీల, ఎస్టీల, మైనారిటీల ఓట్లు ఈ పార్టీలకు పడడంలేదు. ఎలాగూ గెలిచే పరిస్థితి లేదు కనుక దళిత ఓటర్లు కూడా చివరి క్షణంలో ఈ పార్టీలను వదిలిపెట్టి ప్రధాన స్రవంతి పార్టీలకే ఓటు వేస్తున్నారు. సామాజిక సమీకరణాలు అనుకూలించిన కారణంగానే యూపీలో బీఎస్పీ కొంతకాలం అధికారం చేపట్టగలిగిందనేది నిర్వివాదాంశం. బీసీల ఓట్లను ఎస్పీ, దళితుల ఓట్లను బీఎస్పీ గంపగుత్తగా పొందడం అక్కడ సంభవించింది. ముస్లింల ఓట్లను ఇరుపార్టీలూ పంచుకున్నాయి. హిందూ సెంటిమెంటును గట్టిగా రగిలించిన బీజేపీ 2017లో ఈ అన్ని వర్గాల ఓట్లనూ సక్సెస్‌ఫుల్‌గా చీల్చి పగ్గాలు చేపట్టింది.
ప్రవీణ్‌కుమార్ చెప్పినట్లుగా తెలంగాణలో బహుజనుల కోసం మరో కొత్త పార్టీ వస్తే, పైన చెప్పిన అన్ని అంశాలూ ఆ పార్టీకి కూడా వర్తిస్తాయి. వ్యక్తిగతంగా ప్రవీణ్‌కు కూడా దళితుల్లోనే, ప్రధానంగా మాదిగ సామాజికవర్గంలోనే ఆదరణ ఉంది. బీసీల్లో, మైనారిటీల్లో ఎలాంటి అనుకూలతా లేదు. కొత్త పార్టీకి ఆయన నేతగా ఉన్నా, మరొకరు ఉన్నా ఈ అననుకూలతలను దృష్టిలో ఉంచుకోవాలి. దళితేతర బహుజనులను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3.68 కోట్లు కాగా, ఇందులో ఎస్సీలు 18శాతం, ఎస్టీలు 10శాతం, బీసీలు 40శాతం, ముస్లింలు, మైనారిటీలు కలిసి 11శాతం ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి. మొత్తం జనాభాలో 79శాతం ఉన్న బహుజనుల(ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు)ను నిజమైన అర్థంలో ఒక్కటి చేయాలి. ఈ 79శాతం జనాభాలో కనీసం సగానికి పైగా ఓటర్లను తమ అభ్యర్థులకు ఓటు వేసేలా చైతన్యవంతం చేయాలి. అప్పుడే అధికార పీఠం అధిష్టించగలుగుతారు. అలా చేయలేని దళిత, బహుజన పార్టీలు భవిష్యత్తులో ఎన్ని వచ్చినా.. మంద కృష్ణ, ప్రవీణ్‌కుమార్ లాంటి ఎందరు రాజకీయాల్లోకి దిగినా ప్రయోజనం అంతంతమాత్రమే.
– డి.మార్కండేయ