ప్రధాని మోడీపై విమర్శలు చేసిన ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లా

by Shamantha N |
ప్రధాని మోడీపై విమర్శలు చేసిన ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లా
X

శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ జమ్ము కశ్మీర్ ప్రధానస్రవంతి పార్టీల నేతలతో సమావేశమై గొప్ప వాగ్దానాలిచ్చారని, కానీ, వాస్తవంలో అవి అమలు కావడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా విమర్శలు చేశారు. జూన్ 24న ఢిల్లీలో ప్రధానమంత్రి కశ్మీరీ నేతలతో భేటీ అయ్యారు. జమ్ము కశ్మీర్ ప్రజల హృదయాలు గెలుచుకోవాలనుకుంటున్నట్టు అప్పుడు ప్రధాని తెలిపారు. ‘ఢిల్లీ కీ దూరీ’, ‘దిల్ కీ దూరీ’ అనే మాటలకు విరుద్ధంగా వారికి చేరువవుతామని వివరించారు. ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ అబ్దుల్లా ప్రధానిపై విమర్శించారు. తమను సంప్రదించకుండానే ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన మోడీ సర్కారు భేటీలో అద్భుతాలు జరుగుతాయని ఆశించలేదని, కానీ, కశ్మీరీలను ఢిల్లీకి చేరువచేస్తామన్న వ్యాఖ్యలపై ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. అవి కూడా కల్లలేనని తేలిపోయాయని, నెలరోజులైనా కశ్మీర్‌లో వాటి ప్రభావం కనిపించడం లేదని స్పష్టం చేశారు.

ఇంకా ప్రజలపై నిర్బంధం, అసమ్మతిదారులపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. సమావేశం నిర్వహించి నెల రోజులైనప్పటికీ ఇంకా ఫాలో అప్ చర్యలేవీ తీసుకోలేదని విమర్శించారు. అటు ఢిల్లీ నుంచి ఇటు శ్రీనగర్ నుంచి ప్రజలకు విశ్వాసం అందడం లేదని, జవహర్ లాల్ నెహ్రూ, పీవీ నర్సింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయీల హయాంలోనే అనేక హామీలనిచ్చి అమలు చేయక ప్రజల్లో విశ్వాసలేమి పాత్రులయ్యారని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం అధికారులు వచ్చారని, కేంద్రం నుంచి నేతలెవరూ రాలేదన్నారు. ప్రజల్లో విశ్వాసం నింపడానికి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రత్యేకప్రతిపత్తిని కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నేతలకు భద్రత కల్పిస్తామని చెప్పారని గుర్తుచేశారు. కానీ, ప్రధాని భేటీ తర్వాత కొందరికీ సెక్యూరిటీని తొలిగించారన్నారు. ప్రజల సమస్యలతో సంబంధం లేని వారి మనుషులకు మాత్రమే రక్షణ ఇస్తున్నట్టు ఆరోపించారు.

విపక్షాల్లో చీలికలు విషాదం

భారత్‌లో విపక్షాల్లో చీలికలు ఉండటం విషాదమని, ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేయడానికి దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ తమ వైఖరులు, బేధాభిప్రాయాలను పక్కనపెట్టి ఏకమవ్వాలని ఫరూఖ్ అబ్దుల్లా సూచించారు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నదని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్షాలన్నీ వీలైనంత తొందరగా ఏకతాటిమీదకు వస్తాయని ఆశిస్తున్నాని చెప్పారు. ఎందుకంటే సమయం లేదని తెలిపారు. ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు అనే తేడాలేమీ లేవని, అన్ని చోట్ల నుంచి విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం నేడు ఉన్నదని వివరించారు.

Advertisement

Next Story