Ys Jagan protest : ‘ఇండియా’లో చేరండి..జగన్‌కు కూటమి నేతల విజ్ఞప్తి!

by vinod kumar |
Ys Jagan protest : ‘ఇండియా’లో చేరండి..జగన్‌కు కూటమి నేతల విజ్ఞప్తి!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆంద్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ చీఫ్ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. అయితే ఈ ఆందోళనకు పలువురు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తదితర పార్టీలు జగన్‌తో పాటు నిరసనలో పాల్గొన్నాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సంజయ్ రౌత్ ఇతర ప్రముఖ నాయకులు జగన్‌కు సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ను ఇండియా కూటమిలో చేరాలని విజ్ఞప్తి చేశాయి. దీనికి జగన్ సైతం సానుకూలంగానే స్పందిచినట్టు తెలుస్తోంది.

ఆహ్వానించిన వీసీకే

మాజీ సీఎం జగన్‌ను ఇండియా కూటమిలో చేరాలని తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ నేత థోల్ తిరుమావళవన్ ఆహ్వానించారు. కూటమిలో చేరడాన్ని పరిశీలించాలని సూచించారు. ‘మేము మీతో ఉన్నామని మీకు హామీ ఇస్తున్నాం. న్యాయం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని వీసీకే తరపున హామీ ఇస్తున్నా. కానీ ముందుగా మీరు ఇండియా కూటమిలో చేరాలి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోండి’ అని తెలిపారు. అయితే ఇదే విషయమై ఇండియా కూటమి సభ్యులతో అఖిలేష్ మాట్లాడి ఒప్పిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ కూడా దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రిప్లయ్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో వైఎస్సార్‌సీపీ త్వరలోనే ఇండియా అలయెన్స్‌లో చేరబోతుందంటూ ఊహాగానాలు వెలుడుతున్నాయి. కాగా, గతంలో వైఎస్సార్‌సీపీ పలు బిల్లులు ఆమోదం తెలపడంలో బీజేపీకి మద్దతిచ్చింది.

Advertisement

Next Story