బీజేపీ ఉపాధి కల్పించదని యువత అర్థం చేసుకుంది: ప్రియాంక గాంధీ

by Harish |
బీజేపీ ఉపాధి కల్పించదని యువత అర్థం చేసుకుంది: ప్రియాంక గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ దేశంలోని యువతకు ఉపాధి కల్పించదని ఈ విషయాన్ని యువత అర్థం చేసుకున్నారని అన్నారు. వారికి ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికను కలిగి ఉందని ఆమె తెలిపారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డీ) విడుదల చేసిన ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024ను ఉటంకిస్తూ భారతదేశంలోని మొత్తం నిరుద్యోగుల్లో 83 శాతం మంది యువతేనని ప్రియాంక అన్నారు.

2000లో మొత్తం నిరుద్యోగుల్లో చదువుకున్న యువత వాటా 35.2 శాతం కాగా, అది 2022లో రెట్టింపు అయి 65.7 శాతానికి చేరుకుంది. అలాగే, ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు కూడా నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదని పేర్కొంటున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నట్లు ప్రియాంక చెప్పారు.

పేపర్ లీకేజీలను అరికట్టడానికి కాంగ్రెస్ కఠిన చట్టాలను తీసుకు వస్తుంది, గిగ్ వర్కర్‌లకు సామాజిక భద్రత, స్టార్టప్‌ల కోసం 5,000 కోట్ల రూపాయల జాతీయ నిధిని ఏర్పాటు చేయడం వంటి హమీలను అమలు చేస్తామని అన్నారు. యువతే దేశ భవిష్యత్తు, ఉపాధి విప్లవం ద్వారా దేశంలోని యువత చేతులను బలోపేతం చేస్తాము, వారు బలంగా ఉంటేనే దేశం బలపడుతుందని ఆమె ఉద్ఘాటించారు.

Advertisement

Next Story

Most Viewed