ప్రపంచ బెస్ట్ ఎయిర్‌పోర్టుల జాబితాలో నాలుగు భారతీయ విమానాశ్రయాలు

by Dishanational1 |
ప్రపంచ బెస్ట్ ఎయిర్‌పోర్టుల జాబితాలో నాలుగు భారతీయ విమానాశ్రయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ ఉత్తమ విమానాశ్రయాల జాబితాలో భారత్ నుంచి కేవలం 4 ఎయిర్‌పోర్టులే స్థానం దక్కించుకున్నాయి. ప్రముఖ స్కైట్రాక్స్ 12వ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులను ప్రకటించగా, అందులో దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. దీని తర్వాత సింగపూర్‌కు చెందిన ఛాంగి రెండో స్థానం దక్కించుకుంది. గత కొన్నేళ్లుగా ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలను ఈ రెండు ఎయిర్‌పోర్టులే దక్కించుకున్నాయి. ఇక, భారత్‌కు చెందిన నాలుగు విమానాశ్రయాలకు టాప్-100లో చోటు దక్కింది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ ర్యాంకు సాధించగా, బెంగళూరు ఎయిర్‌పోర్టు 69 నుంచి 59వ స్థానానికి మెరుగుపడింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 65 నుంచి 61వ ర్యాంకుకు చేరగా, ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 84 నుంచి 94 స్థానానికి దిగజారింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు దక్షిణాసియాలోనే ఉత్తమ విమానాశ్రయంగా నిలవగా, సిబ్బంది సేవల్లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అగ్రస్థానం సాధించింది. దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్‌పోర్టుగా బెంగళూరు నిలిచింది. ప్రపంచ జాబితాలో సియోల్ ఇన్‌చయాన్ ఎయిర్‌పోర్టు మూడో స్థానంలో, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టుగా అవార్డును సొంతం చేసుకుంది. టోక్యోలోని హనీదా, నరీత వరుసగా 4,5వ ర్యాంకులు పొందాయి.

Next Story