PM Modi: బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ

by S Gopi |
PM Modi: బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 3-4 తేదీల్లో బ్రూనైలో పర్యటించనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అన్ని అంశాలపై చర్చలు జరపనున్నారు. అంతేకాకుండా కొత్త రంగాల్లో సహకారంపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ చర్చలు బ్రూనైతో ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయనుంది. ఆ దేశ సుల్తాన్ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ బ్రూనైలో పర్యటిస్తారు. బ్రూనైలో భారత ప్రధాని ఇది మొదటి ద్వైపాక్షిక పర్యటన కావడం గమనార్హం. ఈ పర్యటన భారత్, బ్రూనై మధ్య దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవం సందర్భంగా ఉంటాయి. దీనిపై సోమవారం విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జైదీప్ మజుందార్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 3-4 తేదీల్లో బ్రూనై, 4-5 తేదీల్లో సింగపూర్‌లో పర్యటిస్తారని, ఈ పర్యటన ఆరేళ్ల తర్వాత జరుగుతోందని చెప్పారు. బ్రూనై పర్యటన ద్వారా ఇరు దేశాలు రక్షణ రంగంలో కీలకమైన జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు కృషి చేస్తాయన్నారు. అదేవిధంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు సింగపూర్ పర్యటనలో సెమీ కండక్టర్ల సహకారానికి అవకాశం ఉందని, భారత్ ఈ విభాగంలో దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోందని మజుందార్ చెప్పారు.

Advertisement

Next Story