Anna University: నిందితుడు డీఎంకే మద్దతుదారుడే.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన

by Shamantha N |
Anna University: నిందితుడు డీఎంకే మద్దతుదారుడే.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: చెన్నైలోని (Chennai) అన్నా యూనివర్సిటీలో (Anna University) యువతిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై డీఎంకే(DMK) అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) స్పందించారు. ఈ మేరక తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడారు. ఈ కేసులో కీలక నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ఒప్పుకున్నారు. ‘‘స్టూడెంట్ పై అత్యాచార ఘటనలో నిందితుడు డీఎంకే మద్దతుదారుడు. కానీ, పార్టీలో సభ్యుడు మాత్రం కాదు. అతడికి మేం ఎలాంటి రక్షణ కల్పించట్లేదు. ఎందుకంటే.. మహిళల భద్రతే మా సర్కారుకు ముఖ్యం. ఈ ఘటనపై కేసు నమోదైన కొన్ని గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల కేసు చాలా తీవ్రమైన సమస్య అని స్టాలిన్ అన్నారు. ఆ విషయాన్ని ఎవరూ కాదనరని చెప్పుకొచ్చారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరగడం తప్ప.. తమిళనాడు ప్రభుత్వానికి మరో లక్ష్యం లేదని ఆయన హామీ ఇచ్చారు. ఈ కేసులో 60 రోజుల్లోగా ఛార్జిషీట్‌ను దాఖలు చేసేలా చూస్తామని అన్నారు. నిందితుడికి గరిష్ఠంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ప్రత్యేక కోర్టులో త్వరితగరితంగా విచారణ జరిపిస్తామన్నారు.

ప్రతిపక్షాల వాకౌట్

మరోవైపు, స్టాలిన్ ప్రసంగం తర్వాత ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ బయట నిరసన చేపట్టారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా.. చెన్నై అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ విద్యార్థిని డిసెంబరు 23న రాత్రి తన స్నేహితుడితో కలిసి వర్సిటీ ప్రాంగణంలో మాట్లాడుతుండగా అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆమె స్నేహితుడిపై దాడి చేసి అక్కడినుంచి పంపించేశారు. తర్వాత యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె ఫొటోలు తీసి, తమపై ఫిర్యాదు చేస్తే వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపైన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో జ్ఞానశేఖరన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed