"మోడీ ఇంటి పేరు" వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పను : Rahul Gandhi

by Vinod kumar |
No Democracy in The Country today, Says Rahul Gandhi
X

న్యూఢిల్లీ : "మోడీ ఇంటి పేరు"కు సంబంధించిన వ్యాఖ్యలు చేసినందుకు తాను క్షమాపణలు చెప్పబోనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. "నేను శిక్షార్హమైన నేరానికి పాల్పడలేదు. నాకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించండి" అని సుప్రీంకోర్టుకు సమర్పించిన రీజాయిండర్ అఫిడవిట్ లో కోరారు. ఒకవేళ తాను క్షమాపణ చెప్పాల్సి వస్తే.. అదే అతిపెద్ద శిక్ష అవుతుందన్నారు. ఒకవేళ క్షమాపణే న్యాయం అయితే.. ఈపాటికే చెప్పి ఉండేవాడినని రాహుల్ పేర్కొన్నారు. "క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందువల్లే.. పిటిషనర్ పూర్ణేష్‌ మోడీ అఫిడవిట్‌లో నన్ను ‘అహంకారి’గా అభివర్ణించారు.

ఏ తప్పూ చేయకపోయినా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్‌ నేరాలు మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయ వ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. నాకు విధించిన శిక్షపై స్టే విధించి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలి" అని రాహుల్‌ గాంధీ కోరారు. "మోడీ అనేది ఇంటిపేరు మాత్రమే. అది కులం కాదు. ఆ ఇంటి పేరు ఉన్న వ్యక్తులు వివిధ వర్గాలు, వివిధ కులాల్లోకి వస్తారు. కాబట్టి నేను చేసిన వ్యాఖ్యలు ఓ వర్గాన్ని ఉద్దేశించినవి కాదు" అని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు.

Advertisement

Next Story