Akhilesh :నేను వైదొలిగాక.. సీఎం నివాసాన్ని గంగాజలంతో కడిగించారు : అఖిలేష్ యాదవ్

by Hajipasha |   ( Updated:2024-07-31 15:15:18.0  )
Akhilesh :నేను వైదొలిగాక.. సీఎం నివాసాన్ని గంగాజలంతో కడిగించారు : అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘తన కులం ఏదో తెలియని వ్యక్తి కులగణన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది’’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా బుధవారం దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ‘‘2017లో నేను యూపీ సీఎం పదవి నుంచి వైదొలిగాను. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ సీఎం అధికారిక నివాసాన్ని గంగాజలంతో శుద్ధి చేయించారు. ఆ తర్వాతే అందులోకి అడుగుపెట్టారు. నేను ఆ చేదు అనుభవాన్ని మర్చిపోలేను’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘చంద్రుడిపైకి మనుషులను పంపడం గురించి బీజేపీ మాట్లాడుతోంది. డిజిటల్ ఇండియా, వికసిత భారత్ అంటోంది. అలాంటప్పుడు గంగాజలంతో ఆనాడు అధికారిక నివాసాన్ని సీఎం యోగి ఎందుకు శుద్ది చేయించారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’’ అని అఖిలేష్ వ్యాఖ్యానించారు. ‘‘కొంతమంది నన్ను కనౌజ్(యూపీ)లో ఉన్న ఓ ఆలయానికి వెళ్లొద్దన్నారు. అయినా నేను వెళ్లాను. అయితే ఆ తర్వాత ఆ ఆలయాన్ని కూడా గంగాజలంతో శుద్ధి చేయించారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘కాంగ్రెస్ నేతలు, ఇతర వ్యక్తుల కులం గురించి అడిగే హక్కు బీజేపీకి ఉందా ?’’ అని సమాజ్‌వాదీ చీఫ్ ఈసందర్భంగా ప్రశ్నించారు.

Advertisement

Next Story