Sebi chief : సెబీ చీఫ్ మాధబి బుచ్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు

by Shamantha N |
Sebi chief : సెబీ చీఫ్ మాధబి బుచ్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌పై (Madhabi puri Buch) కాంగ్రెస్‌ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా ఉంటూనే మాధబి ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వేతనం తీసుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇదంతా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకిందకే వస్తుందని అన్నారు. ఇదంతా నైతికత, జవాబుదారీతనాన్ని ఉల్లంఘించడమే అని తెలిపారు. ఒక కంపెనీలో పనిచేస్తూ ఒకచోట మాత్రమే వేతనం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కానీ సెబీ చీఫ్‌ విషయంలో మాత్రం అలా జరగలేదన్నారు. సెబీ చీఫ్ గా ఉన్న మాధబి ఐసీఐసీఐ బ్యాంకు, ఫ్రుడెన్షియల్ నుంచి వేతనం తీసుకున్నారని ఆరోపించారు. 2017-2024 మధ్య ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్లు కూడా అందుకున్నారని గుర్తుచేశారు. సెబీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఐసీఐసీఐ నుంచి జీతం ఎందుకు తీసుకున్నారు?

2017 నుంచి సెబీ సభ్యురాలిగా ఉన్న మాధబి.. 2022లో ఛైర్‌పర్సన్‌ అయ్యారు. గత ఏఢేళ్లుగా ఆమె రూ.16 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని పవన్ ఖేరా ఆరోపించారు. సెబీలో ఉంటూనే ఐసీఐసీఐ నుంచి జీతం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఆమె జీతం తీసుకోవడం వల్లే ఐసీఐసీఐపై జరగాల్సిన పలు విచారణలు ఆగిపోయాయని ఆరోపించారు. సెబీ చీఫ్‌ నియామకంలో కీలకమైన కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీలో కీలక వ్యక్తులను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా తీరుని కూడా తప్పుబట్టారు.

Advertisement

Next Story

Most Viewed