Agriculture: రైతులకు సరసమైన ధరలకే ఎరువులు: వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్

by S Gopi |
Agriculture: రైతులకు సరసమైన ధరలకే ఎరువులు:  వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సరసమైన ధరలకు ఎరువులు లభిస్తాయని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ రైతులను ఆదుకుంటామన్నారు. శుక్రవారం రాజ్యసభంలో ప్రసంగించిన మంత్రి.. మోడీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దేశంలోని కోట్లాది మంది రైతులకు చౌకగా ఎరువులను అందిస్తామని హామీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. సాధారణంగా రూ. 2,366 విలువైన యూరియాను రైతులకు కేవలం రూ. 266కే అందిస్తామని, రూ. 2,433 విలువైన డీ-అమ్మోనియం ఫాస్పేట్(డీఏపీ)ని రూ. 1,350కి లభిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎరువుల సబ్సీడీని పెంచుతోందని, 2013-14లో సబ్సీడీ మొత్తం రూ. 71,280 కోట్ల నుంచి 2023-24 నాటికి రూ. 1,95,420 కోట్లకు పెరిగిందని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల కారణంగా పెరిగిన డీఏపీ ధరల భారాన్ని రైతులపై పడనివ్వబోమని, అందుకు బదులుగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి రూ. 2,625 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టామని చెప్పారు. ఇదే సమయంలో దేశ వ్యవసాయ రంగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ఆరు కీలక ప్రాధాన్యతలను శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, వాటికి సరైన ధర, ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు ఉపశమనం అందించడం, వ్యవసాయాన్ని వైవిధ్యంగా మార్చడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడతామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed