Yogi Adityanath : 2024 లోక్ సభ ఫలితాల ప్రభావం యోగిపై పడనుందా?

by Shamantha N |   ( Updated:2024-06-08 14:30:27.0  )
Yogi Adityanath : 2024 లోక్ సభ ఫలితాల ప్రభావం యోగిపై పడనుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా బీజేపీకి కంచుకోట అయిన యూపీలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు అందరి దృష్టి 2027లో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఉత్తరప్రదేశ్ లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలకపాత్ర పోషించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీని బలోపేతం చేశారు. ఇక 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఎన్నికల్లో మోడీతో పాటు యోగి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. విపక్షాలను ఎదుర్కొనేందుకు యోగిపైనే కమలపార్టీ ఆధారపడింది. కానీ, అనూహ్యంగా యూపీలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. ఈ ఫలితాల వల్ల బీజేపీకే కాదు.. యోగికి కూడా ఎదురుదెబ్బ తగిలింది.

యూపీలో యోగికి తగ్గిన ప్రాబల్యం

ఇకపోతే, యోగికి తన రాష్ట్రంలో ప్రజాదరణ తగ్గుతున్నట్లు కన్పిస్తోంది. ఘాజీపూర్, చందౌలీ, జౌన్ పూర్, బల్లియా, అజంగఢ్, వారణాసి సహా పలు ప్రాంతాల్లో బీజేపీ గెలిచినప్పటికీ.. మెజార్టీ భారీగా తగ్గింది. దీంతో, 2027 ఎన్నికల్లో ఆయన్ని గద్దెదింపే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ నాయకుల నుంచే యోగికి వ్యతిరేకత ఏర్పడుతోంది. అభ్యర్థుల ఎంపికలో యోగి పరిమిత పాత్ర పోషించారని విమర్శిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 64 మంది బీజేపీ ఎంపీల్లో 49 మందికి ఈసారి కూడా టికెట్లు దక్కాయి. అందులో 27 మంది మాత్రమే గెలిచారు. మిగతా వారు ఓడిపోయారు. అయితే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు.. పలువురు అభ్యర్థులపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ విషయాన్నే హైకమాండ్ కు సూచించారు. అయినప్పటికీ, ఆశ్చర్యపరిచేలా అందరికీ సీట్లు దక్కాయి. మితిమీరిన కేంద్రం జోక్యం వల్లే యూపీలో ఓటమి పాలైనట్లు ఆరాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. అందుకే, యూపీలో తక్కువ స్థానాలకే ఎన్డీఏ పరిమితమైనట్లు సమాచారం.

Advertisement

Next Story