హాథ్రస్ ఘటన ఎఫ్ఐఆర్‌లో 'భోలే బాబా' పేరు లేకపోవడంపై అనుమానాలు

by S Gopi |
హాథ్రస్ ఘటన ఎఫ్ఐఆర్‌లో భోలే బాబా పేరు లేకపోవడంపై అనుమానాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో 121 మందిని బలితీసుకున్న హాథ్రస్ తొక్కిసలాట వ్యవహారంలో రాష్ట్ర పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు గురువారం ప్రకటించారు. అయితే, పదుల సంఖ్యలో మరణాలు సంభవించినప్పటికీ ఈ కార్యక్రమానికి ప్రధాన కారకుడు సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా అలియాస్ నారాయణ్ సాకర్ హరి పేరు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై ఒత్తిడి పెరగడంతో అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథూర్ మాట్లాడుతూ.. దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైందని, వాస్తవాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరుగుతాయని అన్నారు. భోలే బాబాగా ప్రచారంలో ఉన్న వ్యక్తి అసలు పేరు సూరజ్ పాల్ అని, అతన్ని కస్టడీలోకి తీసుకోవడంపై వివరణ ఇచ్చారు. విచారణలో వెల్లడైన విషయాల ఆధారంగా అరెస్టులు చేస్తాం. అవసరమైతే భోలే బాబాను కూడా ప్రశ్నిస్తాం. ఈ ఘటనలో అతని పాత్ర ఉందా లేదా అని చెప్పడం తొందరపాటు వ్యాఖ్య అవుతుంది. ఎఫ్ఐఆర్‌లో అతని పేరు లేదు. ఈ ప్రమాదానికి నిర్వహాకులే బాధ్యత వహించారు. నిర్వాహక కమిటీ, ప్యానెల్ సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమ నిర్వహణను వేద్ ప్రకాష్ మధుకర్ పేరు మీద అనుమతి తీసుకున్నారని, భోలే బాబాను కనిపెట్టేందుకు బృందాలను ఏర్పాటు చేశామని, అతడి గురించి సమాచారం అందించిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటించామని శలభ్ మాథూర్ తెలిపారు. మధుకర్‌ను ప్రశ్నించే సమయంలో ఇంకెవరి పాత్ర అయినా వెల్లడైతే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదే సమయంలో గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భోలే బాబాపై ఉన్న కేసుల గురించి పోలీసు అధికారిని అడగ్గా.. తమ వద్ద సమాచారం ఆధారంగా భోలే బాబా యూపీ పోలీసు విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేశాడని, 2000లో వీఆర్ఎస్ తీసుకున్నట్టు చెప్పారు. ఆగ్రాలో ఉన్నప్పుడు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైందని, తర్వాత నిర్దోషిగా తేలినట్టు చెప్పారు. అతనిపై ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని, దానికోసం వివిధ రాష్ట్రాల పోలీసుల సహాయం తీసుకుంటామని శలభ్ మాథూర్ పేర్కొన్నారు. కాగా మంగళవారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఏడుగురు చిన్నారులతో పాటు 121 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అధికారికంగా సత్సంగ్ కార్యక్రమం కోసం 80 వేల మందికే అనుమతి ఉన్నప్పటికీ, 2.5 లక్షల మంది తరలిరావడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed