Goa : గోవాకు తగ్గిపోతున్న ఫారిన్ టూరిస్టులు.. ఎందుకు ?

by Hajipasha |
Goa : గోవాకు తగ్గిపోతున్న ఫారిన్ టూరిస్టులు.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : గోవా(Goa).. మన దేశంలోని హాట్ టూరిస్ట్ డెస్టినేషన్. గోవా బీచ్‌లు వరల్డ్ ఫేమస్. వీటిని చూసేందుకు విదేశాల నుంచి కూడా టూరిస్టులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. అందుకే గోవా రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా టూరిజం మారింది. అయితే గత ఐదేళ్లుగా గోవాకు వచ్చే విదేశీ టూరిస్టుల(foreign tourists) సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2019లో గోవా సందర్శనకు రికార్డు స్థాయిలో 85 లక్షల మంది ఫారిన్ టూరిస్టులు రాగా, 2023లో కేవలం 15 లక్షల మందే వచ్చారు. ఈ లెక్కన విదేశీ టూరిస్టుల సంఖ్య దాదాపు 75 శాతానికిపైగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి ప్రభావంతో 2020లో 2 లక్షల మంది, 2021లో 5 లక్షల మంది టూరిస్టులే విదేశాల నుంచి గోవాకు వచ్చారు. 2022 సంవత్సరంలో 12 లక్షల మంది ఫారిన్ టూరిస్టులే సందర్శించుకున్నారు. ఇంతకుముందు రష్యా, బ్రిటన్‌ నుంచి ఎక్కువ మంది టూరిస్టులు గోవాకు వచ్చే వారని, ఇప్పుడు వారు శ్రీలంకకు వెళ్తున్నారని పర్యాటక రంగ పరిశీలకులు చెబుతున్నారు.

ట్యాక్సీ మాఫియా ఆగడాలతో..

గోవాలోని ట్యాక్సీ మాఫియా పలువురు విదేశీ టూరిస్టులను ఇబ్బందిపెట్టిన ఘటనలు గతంలో కొన్ని వెలుగుచూశాయి. వాటి వల్ల గోవా టూరిజం ఇమేజ్ దెబ్బతింది. దీంతోపాటు ఇత‌ర‌త్రా అసౌక‌ర్యాల వ‌ల్ల గోవాను టూరిస్టు డెస్టినేషన్‌గా ఎంచుకోవడానికి ఫారిన్ టూరిస్టులు వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఏటా ఎంతోమంది ఇజ్రాయెలీలు గోవా టూర్‌కు వచ్చేవారు. అక్కడ యుద్ధం నడుస్తున్నందున వారు తమ పర్యటనలను వాయిదా వేసుకున్నారు. గోవాతో పోలిస్తే.. థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా‌లలోని బీచ్ సిటీల టూర్ తక్కువ ఖర్చుతో కవర్ అవుతోంది. దీంతో వాటి వైపు ఫారిన్ టూరిస్టులు మొగ్గు చూపుతున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా వసతులు, టూరిస్టుల భద్రత పరంగా గోవా కంటే అవి చాలా బెటర్‌గా ఉన్నాయి. ఈ లోపాలన్నీ అధిగమించగలిగితే మళ్లీ గోవాకు పూర్వవైభవం తప్పక వస్తుంది.

Advertisement

Next Story