అణుబాంబు తీసుకెళ్తే ఏం చేస్తారు.. నోరు జారి అరెస్టయిన ఇద్దరు విమాన ప్రయాణికులు

by S Gopi |
అణుబాంబు తీసుకెళ్తే ఏం చేస్తారు.. నోరు జారి అరెస్టయిన ఇద్దరు విమాన ప్రయాణికులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏ విమానాశ్రయాలైనా సెక్యూరిటీ చెకింగ్ చాలా క్షుణ్ణంగా జరుగుతాయి. ప్రతి వస్తువును పరీక్షించిన తర్వాతే సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణీకులను లోపలికి అనుమతిస్తారు. అయితే, తాజాగా ఓ ఇద్దరు ప్రయాణీకులు నోరు జారీ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో తమ వద్ద 'న్యూక్లియర్ బాంబ్' ఉందని చెప్పినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసు అధికారుల వివరాల ప్రకారం, విమానాశ్రయంలో ఏప్రిల్ 5న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన కశ్యప్ కుమర్, జిగ్నేష్ మలానీ ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు. సెక్యూరిటీ చెకింగ్ తర్వాత ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు ఆకాస విమానం వద్దకు చేరుకున్నారు. విమానం ఎక్కే సమయంలో లాడర్ పాయింట్ వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బంది వారిద్దరినీ మరోసారి తనిఖీ చేయగా, ఒక వ్యక్తి చెకింగ్ పూర్తయింది కదా, మళ్లీ ఎందుకని ప్రశ్నించాడు. నిబంధనల ప్రకారం చేస్తున్నామని, ప్రయాణికుల భద్రత కోసం బోర్డింగ్‌కు ముందు తనిఖీ అవసరమని సిబ్బంది వివరించారు. అయితే, సదరు వ్యక్తి 'నేను అణుబాంబు తీసుకెళ్తే మీరేం చేస్తారు? అని అడిగాడు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది వారిద్దరినీ విమానం ఎక్కేందుకు నిరాకరించారు. ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపడుతున్నట్టు ఓ అధికారి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed