మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం..రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ

by vinod kumar |
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం..రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని మోడీ ఎట్టకేలకు ఈ అంశంపై స్పందించారు. ఈశాన్య రాష్ట్రంలో హింస నిరంతరం తగ్గుముఖం పడుతోందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని నొక్కి చెప్పారు. ఈ అంశంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మోడీ సమాధానమిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల తీర్పులో ప్రజలు ప్రచారాన్ని తిరస్కరించి పనితీరుకు ఓటేశారని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు ఓడిపోయాయన్నారు. జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చివరి దశలో ఉందని, ఉగ్రవాదం, వేర్పాటువాదం తగ్గుముఖం పడుతోందన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని ప్రభుత్వం వదిలిపెట్టబోదని హెచ్చరించారు. అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పారు.

రానున్న ఐదేళ్లు పేదరికంపైనే ఫోకస్

రానున్న ఐదేళ్లలో పేదరికంపై నిర్ణయాత్మక పోరాటం జరగనుందని తెలిపారు. దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినప్పుడు, దాని ప్రయోజనాలు ప్రతి రంగంపై ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది మహిళలు 'లఖపతి దీదీ'లుగా మారారని, రాబోయే రోజుల్లో వారి సంఖ్య 3 కోట్లకు పెరుగుతుందని చెప్పారు. వ్యవసాయం నుంచి మార్కెట్ వరకు ప్రతి రంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తుందని హామీ ఇచ్చారు.

సోనియా గాంధీపై విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై ప్రధాని విమర్శలు చేశారు. ‘వీళ్లు ఆటో పైలట్, రిమోట్ పైలట్ మోడ్‌లో ప్రభుత్వాన్ని నడిపేందుకు అలవాటు పడ్డారు. పని చేయడంపై నమ్మకం లేదు. కేవలం ఎలా వేచి ఉండాలో మాత్రమే తెలుసు’ అని మోడీ సోనియాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అంతేగాక రాజ్యాంగ ప్రతిని ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ తన నల్ల కుబేరులను దాచడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఓటమి ఖాయమైనప్పుడు మాత్రమే కాంగ్రెస్ దళిత అభ్యర్థులను బరిలో నిలుపుతుందని ఆరోపించారు. ఎన్డీయేకు 140 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. యూపీఏ హయాలో రుణమాఫీలో కేవలం 3 కోట్ల మంది రైతులు మాత్రమే లబ్ధి పొందారు, అయితే ఎన్డీయే పిఎం-కిసాన్ పథకం ద్వారా10 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని గుర్తు చేశారు. మోడీ ప్రసంగం అనంతరం రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది.

విపక్ష సభ్యుల వాకౌట్

ప్రధాని మోడీ ప్రసంగంపై అభ్యంతరం తెలుపుతూ ప్రతిపక్ష నేతలు సభలో ఆందోళన చేపట్టారు. సోనియాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే చాన్స్ ఇవ్వాలని, మోడీ ప్రసంగంలో జోక్యం చేసుకోవడానికి అవకాశమివ్వాలని నినాదాలు చేశారు. అయితే వారిని పట్టించుకోకుండా ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. వారిపై రాజ్యసభ చైర్మన్ ధన్ ఖడ్ సీరియస్ అయ్యారు. ప్రతిపక్ష నేతలు పార్లమెంటరీ స్పూర్తిని కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను వారు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. అన్ పార్లమెంటరీ ప్రక్రియను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు.

ప్రధాని చెబుతున్నవన్నీ అబద్దాలే: మల్లికార్జున్ ఖర్గే

రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఏఐసీసీ చీఫ్, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీ చెబుతున్నవన్నీ అబద్దాలే. అందుకే సభ నుంచి బయటకు వచ్చాం. కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకం అని మోడీ అంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే బీజేపీ-ఆర్ఎస్ఎస్, జన్ సంఘ్ వారి రాజకీయ పూర్వీకులు రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం’ అని చెప్పారు.

Next Story

Most Viewed