నో ఆబ్జెక్షన్’కు మళ్లీ పావులు..! ప్రభుత్వ భూముల ‘క్లియరెన్స్’కు కుట్రలు

by Shiva |
నో ఆబ్జెక్షన్’కు మళ్లీ పావులు..! ప్రభుత్వ భూముల ‘క్లియరెన్స్’కు కుట్రలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ స్థలాలను పరాధీనం చేసేందుకు కొందరు పెద్దలు మళ్లీ పావులు కదుపుతున్నారు. గతంలో ఎలాంటి గ్రౌండ్ రిపోర్ట్ లేకుండానే అధికారులు ఎన్ఓసీలు జారీ చేయగా.. వాటిపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు సుమోటోగా స్వీకరించి వాటికి బ్రేక్ వేశారు. అయితే ఇప్పుడు మళ్లీ వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే ప్రచారం జరుగుతున్నది. ఇందుకోసం రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలుస్తున్నది. అయితే ఇలాంటి భూములు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అధికంగా ఉన్నట్లు సమాచారం.

నైట్ టైమ్ ట్రాన్సాక్షన్స్

తహశీల్దార్లు ఎలాంటి నివేదిక ఇవ్వకపోయినా.. గ్రౌండ్ స్టేటస్ ఎలా ఉన్నా.. కొందరు కలెక్టర్లు ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. దశాబ్దాలుగా ఆర్ఓఆర్ రికార్డుల్లో ప్రభుత్వ/పోరంబోకు భూములుగా ఉన్న, నగరం మధ్యలో ఉన్న వాటికి క్లాసిఫికేషన్ చేంజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఇలాంటి భూములు అనేకం ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈడీ, ఐటీ పరిధిలోని భూములు సైతం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ధరణి పోర్టల్ రికార్డులే చెప్తున్నాయి. ప్రధానంగా శేరిలింగంపల్లి, గండిపేట, కూకట్ పల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, పటాన్ చెరు, సంగారెడ్డి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్ పేట తదితర మండలాల్లో అనేక అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం భావిస్తున్నది. ఆఫీసు సమయాల్లో కాకుండా రాత్రి 12 గంటల వరకు ట్రాన్సాక్షన్స్ చేసిన ఘటనలపై దృష్టి సారించినట్లు తెలిసింది.

అనేక ఉదాహరణలు

  • రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నం.27ని డీ నోటిఫై చేస్తూ జారీ చేసిన ఫైల్ నం.ఇ1/2970/2022, తేదీ.23.01.2023పై సీసీఎల్ఏ సుమోటోగా కేసు నమోదు చేసింది. అనేక వివాదాలు ఉన్నాయని గుర్తించింది. నిషేధిత జాబితా నుంచి తొలగింపు చెల్లదని పేర్కొన్నది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీని ఆదేశించింది. క్రయ విక్రయాలు చేపట్టవద్దని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను అప్రమత్తం చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ప్రొసీడింగ్ నం. ఎస్ఈటీటీ.2/211/2023, తేదీ.5.8.2023 జారీ చేశారు. సర్వే నం.27/2లోని 27.18 ఎకరాలపై ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని బట్టి సదరు ల్యాండ్ పొరంబోకుదేనని తేల్చారు. దీంతో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి. అమోయ్ కుమార్ ఎవరి ఒత్తిడి మేరకు రూ. రెండు వేల కోట్ల విలువైన భూమిని పట్టాగా మార్చారన్న దానిపై పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు ఈ ఫైల్ కూడా చకచకా కదులుతున్నట్లు తెలిసింది. తిరిగి క్లియరెన్స్ పొందేందుకు ఒత్తిళ్లు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే కలెక్టర్ గా పని చేసిన సమయంలో అమోయ్ కుమార్ జీహెచ్ఎంసీకి రాసిన లేఖ నం.ఇ1/2970/2022, తేదీ.23.01.2023లో బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, ఎం/ఎస్ సోహిణి బిల్డర్స్ ఎల్ఎల్పీ వంటి కంపెనీ పేర్లను ప్రస్తావించారు.
  • మియాపూర్ సర్వే నం.100/ఆ లో ఎనిమిది ఎకరాలకు గుర్తు తెలియని వ్యక్తులకు హక్కులు కల్పించారు. వెంటనే ఆధార్, ఈ కేవైసీ పూర్తి చేసి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేశారు. ఆ తర్వాత రైట్ ప్రైవపీ కింద వివరాలను దాచేశారు. పైగా ఈ సర్వే నంబరులోని ల్యాండ్ పై క్రయ విక్రయాలు చెల్లవని, పీవోబీలో పేర్కొన్నారు. కానీ ఎన్ఓసీ ఎక్కడి నుంచి వచ్చింది, గుర్తు తెలియని వ్యక్తికి ఎలా కట్టబెట్టారనే ప్రశ్నలకు శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు తమకేం తెలియదంటున్నారు.
  • గుట్టల బేగంపేట సర్వే నం.60/1 లోని రూ.350 కోట్ల విలువైన స్థలాన్ని దక్కించుకునేందుకు సమర్పించిన డాక్యుమెంట్లపై డౌట్స్ ఉన్నాయి. గతంలో పని చేసిన అధికారులంతా ఈ ఫైల్ ని అందుకే రిజెక్ట్ చేశారని సమాచారం. ఇప్పుడేమో ఆ డాక్యుమెంట్లను అధికారులు విశ్వసిస్తుండడం అనుమానాలకు తావిస్తున్నది. సర్వే నం.31 లోని సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేసిన ఫైళ్లను కూడా పరిశీలించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఆ ఫైళ్లలోనూ ఫేక్, ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే వీటిపై అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని తెలుస్తున్నది.
  • గండిపేట మండలం ఖానాపూర్ సర్వే నం.65లో 1947 నుంచి ఎలాంటి క్రయ విక్రయాలు చోటు చేసుకోలేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చెప్తున్నది. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేస్తే నిల్ గా వస్తున్నది. 77 ఏండ్లుగా ఆ సర్వే నంబరులో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. ఎవరూ అమ్మలేదు, కొనలేదని స్పష్టంగా తెలుస్తున్నది. అలాంటప్పుడు ఈ క్లెయిమ్స్ ఎలా వచ్చాయన్నది ప్రశ్న? ఈ సర్వే నంబరు మొత్తం విస్తీర్ణం 547.27 ఎకరాలు ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. ఎలాంటి లావాదేవీలు లేకపోయినప్పటికీ సబ్ డివిజన్లుగా పహానీలు రాశారు. చాలా సబ్ డివిజన్లలోని విస్తీర్ణం ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. కానీ కొన్ని సబ్ డివిజన్లలో పట్టాదారులుగా ప్రైవేటు వ్యక్తుల పేర్లను చేర్చారు. కొందరికేమో ఈ పాస్ బుక్ జారీ చేసినట్లుగా ట్రాన్సాక్షన్ స్టేటస్ లో చూపిస్తున్నారు.

ఫోరెన్సిక్ ఆడిట్ తోనే ఫలితం..

ధరణి అక్రమాలను వెలికితీసేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ ని చేపడతామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగాయి? ఎప్పుడు చేశారు? ఏ ఐడీ ద్వారా, ఏ కంప్యూటర్/ల్యాప్ ట్యాప్ ద్వారా చేశారు? అసలు సంతకాలు ఒరిజినలేనా? ఫోర్జరీయా? ఇలాంటి అనేకాంశాలను వెలికితీస్తామని చెప్పారు. నైట్ టైమ్ ట్రాన్సాక్షన్స్, పీఓబీ నుంచి తొలగింపు వెనుక వాస్తవాలు ఈ ఫోరెన్స్ ఆడిట్ ద్వారానే వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. 50 నుంచి 70 ఏండ్లుగా కొనసాగుతున్న వివాదాస్పద భూములకు ఎన్వోసీలు జారీ చేసిన ఉదంతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయడం ద్వారా ఎంతో మేలు కలుగుతుంది. ఆ భూములు తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ అయితే.. వాటిని వేలం వేయడం ద్వారా రూ.వేల కోట్ల ఆర్జించే అవకాశం ఉందని రిటైర్డ్ రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed