Sri Chaitanya: వెలుగులోకి శ్రీ చైతన్య స్కూల్ చీకటి కోణం..

by Indraja |   ( Updated:2024-07-06 02:54:45.0  )
Sri Chaitanya: వెలుగులోకి శ్రీ చైతన్య స్కూల్ చీకటి కోణం..
X

దిశ, ఇబ్రహీంపట్నం: శ్రీ చైతన్య పాఠశాల పేరుతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకుండా పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నిర్మాణ దశలో ఉన్న భవనంలో చిన్నారుల జీవితాలను పణంగా పెట్టి ధనార్జన ధ్యేయంగా తరగతులు నిర్వహిస్తున్నది శ్రీ చైతన్య పాఠశాల యజమాన్యం. దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు మండిపడ్డారు.

రంగారెడ్ది జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని రాగన్నగూడ, వినాయక టెంపుల్ లైన్‌లో శ్రీ చైతన్య పాఠశాల బిల్డింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అడ్మిషన్స్ తీసుకోకూడదని నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి యథేచ్ఛగా విద్యార్థుల అడ్మిషన్లు తీసుకొని తరగతులు నిర్వహిస్తున్నది. ప్రభుత్వం ఈ పాఠశాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తు్న్నారు.

శ్రీ చైతన్య స్కూల్‌ను సీజ్ చేయాలి

ఓయూ జేఏసీ అధ్యక్షుడు జోగు నరేందర్ ఈ విషయంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇబ్రహీంపట్నం పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా, కార్పొరేట్ మూకలు నగర శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంపై కన్నేశాయి. ఇక్కడ ఉన్న మధ్య తరగతి కుటుంబాలే ఆసరాగా ఈటీఆర్ కాఫీ బిల్డింగ్ పర్మిషన్, ఫైర్ సేఫ్టీ, స్కూల్ గ్రౌండ్ లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రీ చైతన్య పేరుతో బిల్డింగ్ నిర్మాణం పూర్తికాకముందే అడ్మిషన్లు తీసుకొని వేలకు వేల రూపాయలు డబ్బులు దండుకుంటున్నారు.

స్థానిక ఎంఈవో వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేసినా నోటీసులు పంపడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎంఈవో వెంకట్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలి. లేకుంటే ఓయూజేఏసీ తరఫున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.’ అని హెచ్చరించారు.

అనుమతులు లేవు.. త్వరలోనే సీజ్ చేస్తాం

ఈ అంశంపై ఎంఈవో వెంకట్ రెడ్డి స్పంధించారు. ఆయన మాట్లాడుతూ.. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని రాగన్నగూడ, వినాయక టెంపుల్ లైన్‌లో శ్రీ చైతన్య పాఠశాలకు ప్రభుత్వపరమైన ఎలాంటి అనుమతులు లేవని అన్నారు. అలానే అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకుంటామని.. పాఠశాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed