ఉంటారా.. వెళ్లిపోతారా! ‘గ్రేటర్’ మీటింగ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా

by Shiva |
ఉంటారా.. వెళ్లిపోతారా! ‘గ్రేటర్’ మీటింగ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. అసలు వీరు పార్టీలో ఉంటారా.. లేక వెళ్లిపోతారా? అనే చర్చ జరుగుతోంది. శనివారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఒకరోజు ముందు ‘గ్రేటర్’ బీఆర్ఎస్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ మారిన వారిని ఇరుకున పెట్టేలా వ్యూ హాన్ని రూపొందించేందుకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో భేటీ అయి చర్చించాలని భావించారు.

అయితే, ఈ మీటింగుకు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి హాజరు కాలేదు. 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లలో 39 మంది మాత్రమే వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో కొందరు అం దుబాటులో లేకపోవడం, వ్యక్తిగత కారణాలతో రాలేదని తెలిసింది. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తరపున కార్తీక్ రెడ్డి వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సమావేశానికి కేటీఆర్ నేతృత్వం వహిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే, కేటీఆర్, హరీశ్‌‌రావు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ విషయంలో సీనియర్ అడ్వకేట్స్‌‌తో మంతనాలు జరిపేందుకు వెళ్లారు. దీంతో తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

పార్టీ వీడుతారనే ప్రచారం

గ్రేటర్ లో బీఆర్ఎస్ కు పట్టుంది. దీంతో అక్కడ బలపడేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసింది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. మరికొంతమంది కార్పొరేటర్లు క్యూలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాగా, ఇప్పుడు గ్రేటర్ మీటింగుకు గైర్హాజరైన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. గతంలోనూ ఇలా ప్రచారం జరగ్గా.. చాలా మంది పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు గురువారం అర్ధరాత్రి ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉంటారో? ఎవరు ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

తలసానిపైనా అనుమానాలు

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారే అవకాశం ఉందని చర్చ కొనసాగుతున్నది. గ్రేటర్‌లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడు లేకపోవడంతో తలసానికి ఆఫర్ ఇచ్చారని, మంత్రి పదవి సైతం ఇస్తారనే చర్చ జరుగుతున్నది. తలసాని మంత్రిగా ఉన్న సమయంలో గొర్రెల స్కాంలో ఆయన పీఏ పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఉచ్చు తలసానికి చుట్టుకోబోతున్నదని, అందుకే పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ తరుణంలో ఆయన పార్టీ వీడకుండా ఉండడానికే గ్రేటర్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించే బాధ్యతను పార్టీ అధిష్టానం తలసానికి అప్పగించినట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed