ఢిల్లీకి చేరనున్న బిల్లుల చెల్లింపుల పంచాయితీ.. ఈసీఐను కలిసే యోచనలో బల్దియా కాంట్రాక్టర్లు

by Anjali |
ఢిల్లీకి చేరనున్న బిల్లుల చెల్లింపుల పంచాయితీ.. ఈసీఐను కలిసే యోచనలో బల్దియా కాంట్రాక్టర్లు
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన వివిధ రకాల పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పంచాయితీ డిల్లీకి చేరనుంది. హైదరాబాద్ నగరంలో ఎలక్షన్ పనుల బిల్లులు చెల్లించపోవటంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ పై ఫిర్యాదు చేసేందుకు 10 మంది జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బృందం ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమైంది. భారత ఎన్నికల సంఘాన్ని కలిసి పెండింగ్ బిల్లులపై ఫిర్యాదు చేసేందుకు కాంట్రాక్టర్లకు బృందం ఈ నెల 8న ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, గత పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు 150 నుంచి 200 మంది కాంట్రాక్టర్లు డీఆర్సీ సెంటర్లు, పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్‌ల నిర్మాణం, స్టేషనరీ, లైటింగ్, వీడియో, టీ, టిఫిన్స్, భోజనాలు వంటి పనులను చేశారు. వీటిలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సుమారు రూ.20 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పట్లో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రొనాల్డ్ రోస్‌ను కలిసి, బిల్లులు చెల్లించాలని కోరినా, తమ వినతిని పట్టించుకోలేదు.

ఈసీఐ ఆదేశాలను పట్టించుకోని డీఈఓ..

బిల్లుల కోసం తాము చేస్తున్న వినతులను పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు భారత ఎన్నికల సంఘానికి బిల్లుల కాపీలతో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందించిన భారత ఎన్నికల సంఘం కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలంటూ ఆదేశాలను జారీచేసింది. దీంతో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని కాంట్రాక్టర్లకు రూ.8 కోట్ల నుంచి రూ.9 కోట్ల మధ్య బిల్లులు చెల్లించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పట్టించుకోకుండా పక్కనపెట్టడంతో హైదరాబాద్ జిల్లా పరిదిలోని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. వీరిలో చాలా మంది అసెంబ్లీ ఎలక్షన్స్ పనుల బిల్లులు చెల్లిస్తేనే పార్లమెంట్ ఎలక్షన్స్ పనులు చేస్తామని తేల్చి చెప్పినా, అధికారులు బుజ్జగించటంతో పనులు చేశారు. కానీ హైదరాబాద్ జిల్లా పరిధిలో పనిచేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.40 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ బిల్లులకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారితో పాటు వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్ల ఆఫీసుల చుట్టూ తిరిగి కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం ఈసారి నేరుగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని భావించారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ సాయికిరణ్ నేతృత్వంలో ఢిల్లీకి బయల్దేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అసెంబ్లీ ఎలక్షన్స్‌కు రూ.20 కోట్లు అడిషనల్ బడ్జెట్..

పార్లమెంట్ ఎలక్షన్స్ నిర్వహణ కోసం కేంద్రం నుంచి రూ.70 కోట్లు విడుదలైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం ఎన్నికల వ్యయానికి సరిపోలేదని, అదనంగా రూ.20 కోట్లు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఈసీఐను కోరినట్లు సమాచారం. ఈ బడ్జెట్ మంజూరైనా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటం వారు ఢిల్లీకి పయనమయ్యేందుకు మరో కారణంగా చెప్పవచ్చు.

Advertisement

Next Story

Most Viewed