ఢిల్లీలో నీటి సంక్షోభం: అధికారులపై మంత్రి అతిశీ ఫైర్..కారణమిదే?

by vinod kumar |
ఢిల్లీలో నీటి సంక్షోభం: అధికారులపై మంత్రి అతిశీ ఫైర్..కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ నీటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా నీటి ట్యాంకర్ల సంఖ్యను పెంచాలన్న ప్రభుత్వ సూచనను ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) ధిక్కరించిందని ఆప్ మంత్రి అతిశీ ఆరోపించారు. ట్యాంకర్లను ఎందుకు తగ్గించారో డీజేబీ అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సూచనలను పట్టించుకోకపోవడం సరికాదని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ట్యాంకర్ మాఫియాను అరికట్టడం ద్వారా గరిష్టంగా రోజులు 0.5 మిలియన్ గ్యాలన్ల నీటిని ఆదా చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ప్రస్తుతం 40 ఎంజీడీల నీటి కొరతను ఎదుర్కొంటోందని తెలిపారు. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ల నుంచి అదనంగా యమునా నీటిని నగరానికి అందిస్తేనే ఢిల్లీలో నీటి కొరత తీరుతుందని చెప్పారు.

హర్యానా ప్రభుత్వం రాజకీయాలు మానుకుని హిమాచల్ ప్రదేశ్ విడుదల చేసిన నీటిని ఢిల్లీకి సురక్షితంగా చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. యమునా జలాలు ఢిల్లీకి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ట్యాంకర్ మాఫియాకు చెక్ పెట్టేందుకు మునక్ కెనాల్ చుట్టూ పెట్రోలింగ్ ప్రారంభించారు. మునక్ కెనాల్ చుట్టూ పోలీసు పికెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా ఈ ప్రాంతంలో నిఘా మరియు పెట్రోలింగ్‌ను పెంచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. కాగా, ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం ఎదురైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story