Voter id: ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్‌.. త్వరలోనే ఈసీ, యూఐడీఏఐ చర్చలు !

by vinod kumar |
Voter id: ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్‌.. త్వరలోనే ఈసీ, యూఐడీఏఐ చర్చలు !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆధార్ కార్డుతో ఓటర్ గుర్తింపు కార్డులను అనుసంధానించేందుకు ఎన్నికల సంఘం (Election commission) సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఈసీ మంగళవారం కేంద్ర హోం శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ భేటీలో భాగంగా ఆధార్‌తో ఓటర్ ఐడీని అనుసంధానించడంపై ఏకాభిప్రాయం కుదిరింది. దీనిపై త్వరలోనే నిపుణుల అభిప్రాయం సైతం తీసుకోనున్నట్టు ఈసీ తెలిపింది. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానించే పని రాజ్యాంగం (Constitution), సుప్రీంకోర్టు (Supreme court) సూచనల ప్రకారం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం.. భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఇస్తారు. కానీ ఆధార్ అనేది వ్యక్తి గుర్తింపు మాత్రమే. కాబట్టి ఓటర్ ఫొటో ఐడీ కార్డును ఆధార్‌తో అనుసంధానించడానికి అన్ని చట్టాలను పాటించాలి’ అని తెలిపింది.

ఈ ప్రక్రియ ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్లు 23(4), 23(5), 23(6) నిబంధనల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు (2023)కి అనుగుణంగా మాత్రమే జరుగుతుందని తెలిపింది. ఆధార్ కార్డులను జారీ చేసే యూఐడీఏఐతో సాంకేతిక నిపుణులు త్వరలోనే చర్చిస్తారని ఈసీ తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియను సైబర్ భద్రత, డేటా గోప్యతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించనున్నారు. మరోవైపు ఆదార్‌తో ఓటర్ ఐడీ కార్డులను ప్రజలు స్వచ్చందంగా లింకు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆధార్-ఓటర్ కార్డును అనుసంధానించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ప్రభుత్వం గతంలో పార్లమెంటుకు తెలిపింది. అయితే దీనికి ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించలేదు. అంతేగాక ఆధార్ కార్డులను ఓటరు జాబితాకు లింక్ చేయని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించబోమని స్పష్టం చేసింది.

కాగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ (Gnanesh kumar) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల సంస్కరణలను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల నుంచి సైతం అభిప్రాయాలు తెలపాలని సూచించారు. అంతేగాక జిల్లా స్థాయిలో ఎలక్టోరల్ అధికారులతోనూ త్వరలోనూ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన గతంలోనూ ప్రకటించారు.

Next Story

Most Viewed