Kamala Harris: కమలా హ్యారిస్‌ను బెదిరించిన వర్జీనియా వ్యక్తిపై అభియోగాలు మోపిన ఫెడరల్ కోర్టు

by S Gopi |
Kamala Harris: కమలా హ్యారిస్‌ను బెదిరించిన వర్జీనియా వ్యక్తిపై అభియోగాలు మోపిన ఫెడరల్ కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న కమలా హ్యారిస్‌ను సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపింది. కోర్టు రికార్డుల ప్రకారం.. సోషల్ మీడియా సైట్ గెటర్‌లో కమలా హ్యారిస్‌పై వరుసగా ఫ్రాంక్ కారిలో అనే వ్యక్తి బెదిరింపు ధోరణిలో పోస్టు చేశాడు. దాంతో వర్జీనియాలోని ఫెడరల్ కోర్టులో అతనిపై అభియోగాలు మోపబడ్డాయి. 'కమలా హ్యారిస్‌ను సజీవంగా కాల్చాలి. ఎవరూ చేయకపోతే తానే స్వయంగా చేస్తాను ' అని అతను పోస్ట్ చేశాడు. అతని వ్యవహార శైలి వివాదాప్సదం కావడంతో అతనిపై అభియోగాలు మోపారు. ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఫ్రాంక్ కారిలో ఇంట్లో జరిపిన సోదాల్లో రైఫిల్, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు జో బిడెన్ ప్రకటించిన ఆరు రోజుల తర్వాత ఫ్రాంక్ కారిలో వరుసగా బెదిరింపు పోస్టులు చేశాడు. జోబిడెన్‌తో పాటు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫ్ర్ వ్రేలను లక్ష్యంగా కూడా అతడు పోస్టులు చేశారు. ఫ్రాంక్ కారిలో కోర్టు హాజరు కావాల్సి ఉంది. అయితే, అమెరికాలో ప్రభుత్వాధికారులకు బెదిరింపులు పెరగడం పట్ల అమెరికా న్యాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత నెలలోనే ప్రచార ర్యాలీ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story