Vijayendra: గాంధీ కుటుంబానికి కర్ణాటక ఏటీఎంగా మారింది.. బీజేపీ నేత విజయేంద్ర

by vinod kumar |
Vijayendra: గాంధీ కుటుంబానికి కర్ణాటక ఏటీఎంగా మారింది.. బీజేపీ నేత విజయేంద్ర
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ, గాంధీ ఫ్యామిలీకి కర్ణాటక ఏటీఎంలా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ, జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) సంయుక్తంగా నిర్వహించిన ‘మైసూరు చలో’ పాదయాత్రలో విజయేంద్ర ప్రసంగించారు. ‘తాము అధికారంలోకి వస్తే మంచి పరిపాలన, అభివృద్ధి, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజలకు వాగ్దానం చేసింది. కానీ సిద్ధరామయ్య నేతృత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. రైతులు భారీ నష్టపోతున్నారు. అనేక అవినీతి కేసులు వెలుగు చూస్తున్నాయి. వీటన్నింటినీ సీఎం పట్టించుకోవడం లేదు’ అని తెలిపారు.

కాంగ్రెస్ హై కమాండ్ చేతిలో సిద్ధరామయ్య కీలుబొమ్మగా మారారని, పార్టీకి, గాంధీ ఫ్యామిలీకి కర్ణాటక ఏటీఎంలా మారిందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందన్నారు. కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ..ముడా సైట్ కేటాయింపు, వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణాలకు సంబంధించిన అన్ని పత్రాలను సీఎం ముందు ఉంచినట్టు తెలిపారు. ఈ సమస్యపై ఆయన స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. బీజేపీ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. లేని సమస్యను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

Advertisement

Next Story