‘సరైన టైంలో నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయలేదు’

by Harish |
‘సరైన టైంలో నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయలేదు’
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో వేల కోట్ల బ్యాంకు మోసాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి వారిని సరైన సమయంలో అరెస్టు చేయడంలో దర్యాప్తు సంస్థలు ఫెయిల్ అయ్యాయని ముంబైలోని ప్రత్యేక కోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యోమేష్ షా విదేశాలకు వెళ్లేందుకు ముందస్తుగా కోర్టు అనుమతి తీసుకోవాలనే బెయిల్ షరతును ఉపసంహరించుకోవాలని చేసిన రిక్వెస్ట్‌ను మే 29న కోర్టు అంగీకరించింది. అయితే ఆయన దరఖాస్తును అనుమతించడం వల్ల నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి పరిస్థితులు తలెత్తుతాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదించింది.

దర్యాప్తు సంస్థ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి, కుంభకోణాలకు పాల్పడిన వ్యాపారవేత్తలను సరైన సమయంలో దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయకపోవడం వలనే వారంతా దేశం విడిచి పారిపోయారు, కానీ వ్యోమేష్ షా మాత్రం కోర్టుకు హాజరై సమన్లకు సమాధానాలు ఇచ్చారని, బెయిల్ పొందారని, విదేశాలకు వెళ్లడానికి చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కాబట్టి నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్షి తదితరుల కేసులతో షా కేసును పోల్చలేమని కోర్టు ఈ సందర్బంగా పేర్కొంది.

వేల కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. మోదీ ప్రస్తుతం UKలో జైలు శిక్ష అనుభవిస్తుండగా, చోక్సీ ఆంటిగ్వాలో ఉంటున్నారు. మరో వ్యాపారవేత్త విజయ్‌మాల్యా ప్రస్తుతం UKలో ఉన్నారు, ఆయన 900 కోట్లకు పైగా రుణాల మోసం కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈడీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed