వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం: అదానీ, అంబానీ కీలక ప్రకటనలు

by samatah |
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం: అదానీ, అంబానీ కీలక ప్రకటనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. జనవరి 10-12 వరకు జరిగే 10వ ఎడిషన్ సమ్మిట్‌కు ‘గేట్‌వే టు ది ఫ్యూచర్’ థీమ్‌గా ఉంది. కార్యక్రమంలో భాగంగా సీఎం భూపేంద్ర పటేల్ 130 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ప్రధాని మోడీ వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో ప్రధానంగా పరిశ్రమ 4.0, టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ సస్టైనబిలిటీ వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమ్మిట్‌లో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా అదానీ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లో రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో లక్ష ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. గత సమ్మిట్‌లో ప్రకటించిన 50,000 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినట్టు చెప్పారు.

లక్ష్యం నెరవేర్చేందుకు తోడ్పడతాం: ముఖేశ్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ.. గత పదేళ్లలో భారత్ అంతటా 12లక్షల కోట్లు పెట్టుబడి పెడితే.. ఇందులో గుజరాత్‌లోనే మూడింట ఒక వంతు ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపారు. గ్రీన్ గ్రోత్‌లో గుజరాత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చేందుకు కంపెనీ దోహదపడుతుందని చెప్పారు. ‘2030 నాటికి పునరుత్పాదక ఇంధనాల ద్వారా గుజరాత్ లక్ష్యాన్ని సగం శక్తి అవసరాలు తీర్చడానికి సహాయం చేస్తాం’ అని వెల్లడించారు.

సదస్సు నేపథ్యమిదే..

వైబ్రంట్ గుజరాత్‌ను వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అని కూడా పిలుస్తారు. దీని ముఖ్య ఉద్దేశం గుజరాత్‌ను ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రోత్సహించడం, వివిధ రంగాల్లో భాగస్వామ్యాలను సులభతరం చేయడం. 2003లో అప్పడు సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ ఈ సదస్సు ప్రారంభించగా.. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ సమ్మిట్‌లో భాగంగా గుజరాత్‌లో అనేక ఒప్పందాలు చేయబడ్డాయి.

Advertisement

Next Story

Most Viewed