యూసీసీ డ్రాఫ్ట్ : గిరిజనులకు మినహాయింపు.. హలాల్, ట్రిపుల్ తలాక్‌పై బ్యాన్

by Hajipasha |   ( Updated:2024-02-02 15:31:00.0  )
యూసీసీ డ్రాఫ్ట్ : గిరిజనులకు మినహాయింపు.. హలాల్, ట్రిపుల్ తలాక్‌పై బ్యాన్
X

దిశ, నేషనల్ బ్యూరో : యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) ముసాయిదా బిల్లును ఐదుగురు సభ్యుల డ్రాఫ్టింగ్ కమిటీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి శుక్రవారం సమర్పించింది. ఈ ముసాయిదాపై చర్చించి, ఆమోదించేందుకు ఈనెల 5న రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. యూసీసీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న ఉత్తరాఖండ్ గిరిజన వర్గాన్ని ఈ ముసాయిదా బిల్లు నుంచి మినహాయించాలని కమిటీ సిఫారసు చేసిందని సమాచారం. రాష్ట్రంలో 2.9 శాతం గిరిజన జనాభా ఉంది. ఇక హలాల్ ట్యాగ్‌తో ఉత్పత్తుల విక్రయాలు, ఇద్దత్, ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం వంటి వాటిపై బ్యాన్ విధించాలని నివేదికలో ప్రస్తావించారని తెలుస్తోంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కమిటీ సూచించినట్లు తెలిసింది. అన్ని మతాలలో వివాహానికి చట్టబద్ధమైన వయస్సును ఏకరీతిగా మార్చాలని కూడా ప్రతిపాదించింది. దత్తత హక్కులు అందరికీ ఒకేలా చేయడానికి, బాల్య న్యాయ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం కింద ఉన్న చట్టాలను ఏకరీతిగా అనుసరించాలని సిఫార్సులు చేసిందని అంటున్నారు.

Advertisement

Next Story