Union Ministries : ప్రైవేటు నిపుణులకు కేంద్ర శాఖల్లో పదవులు.. యూపీఎస్‌సీ నోటిఫికేషన్

by Hajipasha |
Union Ministries : ప్రైవేటు నిపుణులకు కేంద్ర శాఖల్లో పదవులు.. యూపీఎస్‌సీ నోటిఫికేషన్
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర క్యాబినెట్‌లోని వివిధ శాఖలకు సీనియర్ బ్యూరోక్రాట్ల నియామకాల విషయంలో గత కొన్ని రోజులుగా నోటిఫికేషన్లు వెలువరిస్తూ వచ్చిన మోడీ సర్కారు శనివారం మరో పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. 24 కేంద్ర మంత్రిత్వ శాఖలకు లేటరల్ ఎంట్రీ పద్ధతిలో 45 మంది సెక్రెటరీలు, డిప్యూటీ సెక్రెటరీల నియామకానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు సెప్టెంబరు 17లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ పోస్టులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాదు. ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్నవారు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్నవారు, అటానమస్ సంస్థల్లో సేవలు అందిస్తున్నవారు, యూనివర్సిటీలు/రీసెర్చ్ సంస్థలు/ప్రైవేటురంగ కంపెనీలు/కన్సల్టెన్సీలు/మల్టీనేషనల్ కంపెనీలలో పనిచేస్తున్న నిపుణులు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. మొత్తం 45 పోస్టులలో 10 కేంద్ర మంత్రిత్వ శాఖల జాయింట్ సెక్రెటరీ పోస్టులు, 35 డైరెక్టర్/డిప్యూటీ సెక్రెటరీ స్థాయి పోస్టులు ఉన్నాయని వెల్లడించింది. కీలకమైన జాయింట్ సెక్రెటరీ పోస్టుల విషయానికొస్తే.. ఆర్థికశాఖలో రెండు, హోంశాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలలో చెరో పోస్టు ఉన్నాయి. డైరెక్టర్ / డిప్యూటీ సెక్రెటరీ పోస్టుల విషయానికొస్తే.. వ్యవసాయ శాఖలో 8, విద్యాశాఖలో 2, విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖలో చెరో పోస్టు ఉన్నాయి.

అనుభవం, వయోపరిమితి..

జాయింట్ సెక్రెటరీ పోస్టుకు అప్లై చేయాలంటే కనీసం 15 ఏళ్ల అనుభవం, డైరెక్టర్ స్థాయి పోస్టుకు పదేళ్ల అనుభవం, డిప్యూటీ సెక్రెటరీ స్థాయి పదవికి ఏడేళ్ల అనుభవం ఉండాలని యూపీఎస్‌సీ తెలిపింది. జాయింట్ సెక్రెటరీ పోస్టుకు అప్లై చేసే వారి వయసు 40 నుంచి 55 ఏళ్లలోపు ఉండాలి. డైరెక్టర్ స్థాయి పోస్టుకు 35 నుంచి 45 ఏళ్లలోపు, డిప్యూటీ సెక్రెటరీ స్థాయి పోస్టుకు 32 నుంచి 40 ఏళ్లలోపు వయసు కలిగిన వారు అర్హులని యూపీఎస్‌సీ వెల్లడించింది. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారు కనీసం మూడేళ్లు ఆయా మంత్రిత్వ శాఖలో సేవలు అందించాల్సి ఉంటుంది. పనితీరు బాగుంటే పదవీ కాలాన్ని ఐదేళ్ల పాటు కొనసాగిస్తారు.

Advertisement

Next Story

Most Viewed