CM నితీష్ కుమార్‌కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత

by Satheesh |
CM నితీష్ కుమార్‌కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేయడానికి కంకణం కట్టుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు బిగ్ షాక్ తగిలింది. గత కొంత కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న జేడీ(యూ) నేత ఉపేంద్ర కుష్వాహా ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం పాట్నాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

అలాగే రాష్ట్రీయ లోక్ జనతాదళ్ అనే కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చాక నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘటబంధన్‌కు ప్రస్తుత డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నాయకత్వం వహిస్తారని ఇటీవల నితీష్ కుమార్ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలపై ఉపేంద్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన జేడీయూకు రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ ఇవాళ తన రాజీనామా ప్రకటించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన అనంతరం బీజేపీలో చేరుతారనే టాక్ వినిపించినప్పటికీ అలా చేయకుండా సొంత వేదికను ప్రకటించడంతో బిహార్ రాజకీయ చదరంగంలో మరో పార్టీ ఏర్పాటైంది. ఇదిలా ఉంటే ఉపేంద్ర వ్యవహారంపై నితీష్ కుమార్ ముందే ఊహించారని తెలుస్తోంది. ఇప్పటికే కుష్వాహా పలు సార్లు తమ కూటమిలోకి రావడం, వెళ్లిపోవడం నితీష్ కుమార్‌ను అసంతృప్తికి గురిచేస్తోందని అందువల్లే అతడి విషయంలో అంతా లైట్ తీసుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed