Yogi Adityanath : సీఎం యోగిని జనవరి 26న హత్య చేస్తానంటూ బెదిరింపు.. యువకుడి అరెస్ట్

by Hajipasha |
Yogi Adityanath : సీఎం యోగిని జనవరి 26న హత్య చేస్తానంటూ బెదిరింపు.. యువకుడి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి(UP CM) యోగి ఆదిత్యనాథ్‌‌(Yogi Adityanath)ను హత్య చేస్తానంటూ బెదిరించిన ఓ యువకుడిని బరేలీలో పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 112 నంబరుకు ఫోన్ కాల్ చేసిన సదరు యువకుడు.. జనవరి 26న సీఎం యోగిపై కాల్పులు జరుపుతానని చెప్పాడు. ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జితో పాటు అక్కడి పలువురు అధికారులపైనా దాడులు చేస్తానని బెదిరించాడు. సదరు యువకుడు కాల్ చేసిన ఫోన్ నంబరు లొకేషన్‌ను ట్రేస్ చేసేందుకు పోలీసులు ఎంతో యత్నించారు. అయితే వెంటనే అతడు ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయడంతో లొకేషన్ గుర్తింపు కష్టతరంగా మారింది. అయినా అధునాతన టెక్నాలజీని వాడుకొని యువకుడు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించగలిగారు. దాని ఆధారంగా అతగాడిని బుధవారం రోజు అదుపులోకి తీసుకున్నారు.

ఈవివరాలను ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ధనుంజయ్ పాండే గురువారం మీడియాకు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సీఎంకు ఆ యువకుడు హత్య బెదిరింపు ఎందుకు ఇచ్చాడు ? కారణం ఏమిటి ? అతడి మానసిక స్థితి ఎలా ఉంది ? అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. ‘‘ఆ యువకుడి బైక్‌ను అతడి ఫ్రెండ్ తీసుకెళ్లాడని మాకు తెలిసింది. తన బైక్‌ను ఫ్రెండ్ తిరిగి అప్పగించకపోవడంతో అతడు కోపంతో రగిలిపోయాడని మాకు సమాచారం అందింది. ఆ కోపంలోనే సదరు యువకుడు 112 నంబరు కాల్ చేసి ఉంటాడని భావిస్తున్నాం’’ అని పోలీసు వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed