రాజ్యాంగం మారిస్తే రాజీనామా చేస్తా..కేంద్ర మంత్రి అథవాలే

by samatah |
రాజ్యాంగం మారిస్తే రాజీనామా చేస్తా..కేంద్ర మంత్రి అథవాలే
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉందన్న కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) అధినేత రాందాస్ అథవాలే తోసిపుచ్చారు. రాజ్యాంగం ఎప్పటికీ మారదని..అలా జరిగితే తాను పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు లేవు. కానీ బీజేపీ ప్రభుత్వం 400కు పైగా సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపిస్తూ..కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. వారి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటా’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ విజన్ ఉన్న వ్యక్తి అని, దేశ ప్రగతికి కృషి చేస్తున్నారని తెలిపారు. మోడీ హయాంలోనే దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుందని కొనియాడారు. కాగా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) మహారాష్ట్రలో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed