Uddhav Thackeray: శివాజీ విగ్రహం కూలిపోవడం మహారాష్ట్రకు అవమానం: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే

by vinod kumar |   ( Updated:2024-09-01 09:41:46.0  )
Uddhav Thackeray: శివాజీ విగ్రహం కూలిపోవడం మహారాష్ట్రకు అవమానం: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడం మహారాష్ట్రకు అవమానమని శివసేన(యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిపోవడాన్ని నిరసిస్తూ మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలో నిరసన చేపట్టారు. దక్షిణ ముంబైలోని హుటాత్మా చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఉద్ధవ్ ప్రసంగిస్తూ..విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పినప్పుడు ఆయన ముఖంలో అహంకారం కనిపించిందని విమర్శించారు. మోడీ క్షమాపణలను మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ అంగీకరించబోరన్నారు.

విగ్రహం కూలిపోవడానికి దారితీసిన అవినీతిని దాచిపెట్టేందుకే మోడీ సారీ చెప్పారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రామ మందిరం, పార్లమెంట్‌ హౌస్‌, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం సహా ఎక్కడ మోడీ హస్తం ఉందో అక్కడ ప్రతి పనిలో నాణ్యత లోపించిందని ఎద్దేవా చేశారు. అనంతరం ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ..అధికార పార్టీ వైఖరి శివాజీ మహారాజ్‌ను అవమానించిందని విమర్శించారు. రాష్ట్రంలో శివాజీ మహారాజ్‌ విగ్రహాలు చాలా ఉన్నాయని, కానీ మాల్వాన్‌లో ఉన్న విగ్రహం మాత్రమే ఎందుకు కూలిపోయిందని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. నిరసనలో ఆదిత్య థాక్రే, సుప్రియా సూలే, నానా పటోలే సహా ఎంవీఏకు చెందిన నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story